నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇనె్వస్టర్లకు, వాణిజ్య, వృత్తి నిపుణులకు పిలుపునిచ్చారు. నిన్నటి నుంచి గల్ఫ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండియన్ బిజినెస్, ప్రొఫెషనల్ కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య, వ్యాపార సానుకూలాంశాలు, పెట్టుబడులకు తామిస్తున్న భరోసాపై వారికి వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నిర్మాణంతో హైదరాబాద్‌ను విశ్వస్థాయి నగరంగా తీర్చిదిద్దామని, అలాంటి తనకు మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించే అపూర్వ అవకాశం లభించిందని చంద్రబాబు వివరించారు.

సహజ వనరులతో సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్‌కు పుష్కల స్థాయిలో మానవ వనరుల లభ్యత ఒక వరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్, ఫార్మా, ఏరోస్పేస్, ఫిన్‌టెక్ రంగాల అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న తమ రాష్ట్రంలో ఇనె్వస్టర్లకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సమర్థత, పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్యం చేయటం సునాయాసం, సులభతరం, ఆటంక రహితమన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మేము మొదటి స్థానంలో ఉన్నాం. మీ వ్యాపారాలకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్యస్థానం. మీరంతా మంచి ప్రతిపాదనలతో రాష్ట్రానికి రండి’ అని చంద్రబాబు ఆహ్వానించారు.