ఆందోళన కలిగిస్తున్న భారత్ వృద్దిరేటు : కౌశిక్ బసు

03-09-2017

ఆందోళన కలిగిస్తున్న భారత్ వృద్దిరేటు : కౌశిక్ బసు

పెద్దనోట్ల రద్దుతో భారత్‌ భారీ మూల్యం చెల్లించుకుందని ప్రపంచబ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌బసు అన్నారు. భారత జీడీపీ వృద్దిరేటు మూడేళ్ల కనిష్ఠానికి 5.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పెద్దనోట్ల రద్దుతో జీడీపీ వృద్దిరేటు 6 శాతం కంటే మరింత కిందికి దిగివస్తుందని తనకు తెలుసని… వృద్దిరేటు 5.7 శాతం తన అంచనా కంటే కూడా చాలా తక్కువగా ఉందని ఆయన వాషింగ్టన్‌లో పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. 2003 నుంచి 2011 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం పైనే వృద్దిని సాధించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్ని 2008లోనే స్వల్పకాలానికి వృద్దిరేటు 6.8 శాతానికి పడిపోయి అటు తర్వాత నుంచి ఎనిమిది శాతానికి ఎగబాకిందన్నారు. ప్రస్తుతం చమురు ధరలు బాగా తగ్గాయి. వృద్దిరేటులో భారత్‌ చైనాను మించిపోతోంది. అలాంటి సమయంలో వృద్దిరేటు 8 శాతంపైనే ఉండాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్దిరేటు 5.7 శాతంగా నమోదైంది అంటే గతేడాదితో పోల్చుకుంటే 2.3 శాతం తగ్గింది. దీనికి ప్రధాన కారణం పెద్దనోట్ల రద్దే అని.. భారత్‌ దీనికి భారీ మూల్యం చెల్లించుకుందని బసు అన్నారు.

99 శాతం కరెన్సీ ఆర్‌బీఐ గూటికి రావడంపై : పెద్దనోట్ల రద్దు తర్వాత 99 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకులకు వచ్చి చేరిందని ఆర్‌బీఐ ప్రకటించడాని బట్టి చూస్తే.. సంపన్నులు తమ వద్ద ఉన్న కరెన్సీని బ్యాంకుల్లో జమ చేశారని అర్ధం. మొత్తానికి ఇబ్బందులు పడింది మాత్రం అసంఘటిత రంగానికి చెందిన వారు, చిరు వ్యాపారులేనని బసు పేర్కొన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టి)తో పాటు దివాలాచట్టం తీసుకురావడాన్ని ఆయన ప్రశంసించారు.