కోవిడ్ 19 ఆర్థిక ఉపశమనం!

కోవిడ్ 19 ఆర్థిక ఉపశమనం!

25-03-2020

కోవిడ్ 19 ఆర్థిక ఉపశమనం!

కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా ప్రజలు, వ్యాపారులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్‍టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ ప్రకటించారు.  2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే గడువును జూన్‍ 30 వరకు పొడిగించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‍టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు ఈ నెలాఖరు వరకే ఉండగా, ఇది సైతం జూన్‍ 30 వరకు పెరిగింది.

మార్చి, ఏప్రిల్‍, మే నెలల జీఎస్‍టీ రిటర్నులను ఎటువంటి జరిమానాలు లేకుండా జూన్‍ నెలాఖరు వరకు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆలస్యపు రిటర్నులపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్‍ ఉన్న ఎంఎస్‍ఎంఈలకు పెనాల్టీ, ఆలస్యపు రుసుములు ఉండవు. రూ.5 కోట్ల టర్నోవర్‍ దాటిన వారు సైతం జూన్‍ నెలాఖరు వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కానీ, గడువు దాటిన తర్వాత కాలానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‍, పాన్‍ అనుసంధాన గడువు  జూన్‍ 30 వరకు పెరిగింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డెబిట్‍కార్డు లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. మెట్రోల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు మూడు మించితే, నాన్‍ మెట్రోలో ఐదు లావాదేవీల తర్వాత ప్రస్తుతం చార్జీ విధిస్తున్నారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణలో విఫలమైతే వసూలు చేసే చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసింది. డిజిటల్‍ రూపంలో చేసే వాణిజ్య లావాదేవీల చార్జీలతగ్గింపు. ఆదాయపన్ను వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన వివాద్‍సే విశ్వాస్‍ పథకం గడువు జూన్‍ 30 వరకు పొడిగింపు. దీనివల్ల జూన్‍ నాటికి చేసే చెల్లింపులపై అదనంగా 10 శాతం చార్జీ ఉండదు. పొదుపు సాధనాల్లో పెట్టుబడులు లేదా మూలధన లాభాల పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల గడువు, నోటీసుల జారీ గడువును కూడా మూడు నెలలు పొడిగించారు. ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ పన్ను మదింపు, రెగ్యులర్‍ ట్యాక్స్, టీడీఎస్‍, టీసీఎస్‍, ఎస్‍టీటీ ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 12/18 శాతానికి బదులు 9 శాతం వసూలు చేస్తారు. కంపెనీల డైరెక్టర్ల బోర్డులు చట్ట ప్రకారం 120 రోజులకోసారి సమావేశం కావాల్సి ఉండగా, ఈ గడువును  కూడా మరో 60 రోజులు పొడిగించారు.

 ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ముగింపు దశలో ఉందని, దీన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతారామన్‍ తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్‍ 19 ఎకనమిక్‍ టాస్క్ఫోర్స్ కూడా పని ప్రారంభించింది. టాస్క్ఫోర్స్ పని ఎన్నో అంచనాలతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఇది ముగింపు దశలో ఉంది’’ అని మంత్రి వివరించారు.