ఓఆర్ఆర్.. దగ్గర రియల్ ఎస్టేట్ పరుగులు

30-10-2019

ఓఆర్ఆర్.. దగ్గర రియల్ ఎస్టేట్ పరుగులు

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ అన్నీచోట్లా పరుగులు పెడుతోంది. హైదరాబాద్‌ రూపురేఖలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు మార్చింది. ఇప్పుడు ఆ ప్రాంతాలు అభివృద్ధిచెందటంతో ఆ ప్రాంతాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు వచ్చాయి. సరికొత్త హబ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా అక్కడివారికోసం కొత్త ప్రాజెక్టులు, గహసముదాయాలు ఏర్పాటు అవుతున్నాయి. తూర్పులో బయోటెక్‌ హబ్‌, జినోమ్‌ వ్యాలీ.. దక్షిణంలో ఐటీ, ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. పటాన్‌చెరు, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, కొంపల్లి-గుండ్లపోచంపల్లి, ఘట్‌కేసర్‌, పెద్దఅంబర్‌పేట్‌ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు వల్ల పటాన్‌చెరు ప్రాంతం మెరుగైన సౌకర్యాలతో ఆకర్షిస్తోంది. ఇక్కడ కొత్తగా ఏర్పాటవుతున్న నివాస సముదాయాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండిపెండెంట్‌ విల్లాలను నిర్మించేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఆదిభట్ల ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ జోరందుకుంది. టీసీఎస్‌, టాటా ఎయిరో డిఫెన్స్‌, ఇతర రక్షణ ఉత్పత్తి పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో అనేక గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు అక్కడ నిర్మాణ దశలో  ఉన్నాయి. ఎడ్యుకేషన్‌ హబ్‌గా ప్రాచుర్యం పొందిన ఇబ్రహీంపట్నం.. క్రమక్రమంగా నివాస సముదాయంగా అభివద్ధి చెందుతోంది. ఇక్కడ కొత్తగా లేఅవుట్లు, గహసముదాయాల ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్నది. బొంగలూరు, నాదర్‌గుల్‌ వంటి ప్రాంతాలు మెరుగ్గా అభివద్ధి చెందుతున్నాయి.

కొంపల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాలు ఉత్తర హైదరాబాద్‌లో గణనీయంగా వద్ధి చెందుతున్నది. ఎడ్యుకేషన్‌ హబ్‌గా స్థిరపడిన ఈ ప్రాంతాల్లో అందుబాటు గహాల ప్రాజెక్టుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. ధర తక్కువ గల ఫ్లాట్లను కొనడానికి ఈ ప్రాంతాలు హాట్‌ లొకేషన్‌గా చెప్పవచ్చు. ఘట్‌కేసర్‌లో ఇన్ఫోసిస్‌, రహేజా మైండ్‌ స్పేస్‌ వంటి ఐటీ సముదాయాలకు ఓఆర్‌ఆర్‌తో చక్కటి అనుసంధానం ఏర్పడింది. దీని వల్ల ఘట్‌కేసర్‌ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఈ ప్రాంతాన్ని ఈస్ట్‌ ఐటీ కారిడార్‌గా అభివర్ణిస్త్తున్నారు. హైదరాబాద్‌- విజయవాడ రహదారి మీద ఉన్న పెద్ద అంబర్‌పేట్‌ ప్రాంతం.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా ఇతర ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నది. దీంతో, పెద్ద అంబర్‌పేట్‌ చుట్టుపక్కల కొత్త ప్రాంతాలు నివాస సముదాయాలుగా అభివద్ధి చెందాయి. ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు తమ నిర్మాణాలను ప్రారంభించాయి.