అందరి చూపు హైదరాబాద్ వైపే.... ఆకాశమే హద్దుగా రియల్ జోరు

21-10-2019

అందరి చూపు హైదరాబాద్ వైపే.... ఆకాశమే హద్దుగా రియల్ జోరు

దేశంలో అనేక నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆర్థికమాంద్యం?పరిస్థితులు ఉన్నా, హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొనేవారు కొంటూనే ఉన్నారు. కొత్త ప్రాజెక్టులతో కంపెనీలు వస్తూనే ఉన్నాయి. దాంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం భాగ్యనగరంలో తారాజువ్వలా దూసుకుపోతోంది. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆకాశహర్మ్యాలే కనిపిస్తున్నాయి. వినూత్న అభివృద్ధి ప్రణాళికతో, మౌళికంగా మెరుగవుతున్న నగరంలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాలవారితోపాటు, ఎన్నారైలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. దేశ, విదేశీ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఐటీ, వాణిజ్య సముదాయాలతో కళకళలాడుతున్న హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు ఎన్నటికీ ఢోకా లేదని మరోమారు నిరూపితమైంది.

రాష్ట్ర విభజన తరువాత ఐదు సంవత్సరాల తరువాత, రాజకీయ స్థిరత్వం మరియు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు వంటి అంశాలు హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి సహాయపడ్డాయి. ఉత్తరాదివారికి ఇప్పుడు హైదరాబాదే హాట్‌ ప్లేస్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే మెట్రోలాంటి రవాణా వ్యవస్థలు, పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వంటివి వారిని ఆకర్షిస్తున్నాయి. దాంతో ఉత్తరాదివారి ఎంతోమంది రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. మరోవైపు ఎన్నారైలు కూడా తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ మంచి ప్లేస్‌ అనే నమ్ముతున్నారు.

2019 - 2035 మధ్య ప్రపంచంలో అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న 10 భారతీయ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి అని ప్రపంచ ఆర్థిక ఫోరం గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. వ్యాపార అనుకూల విధానాలు, ఐటి మరియు తయారీ సంస్థల రాక, ఏరోస్పేస్‌, రక్షణ వంటి రంగాలకు భాగ్యనగరం నిలయం కావడంతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి వేగంగా జరుగుతోంది.

నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌  నివేదిక ప్రకారం, మెరుగైన నాణ్యమైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవన వ్యయం, అనుకూలమైన వ్యాపార వాతావరణం, అర్హతగల అనుభవజ్ఞులైన ప్రతిభావంతులతో కూడిన మానవవనరులు ఇక్కడ ఉన్నాయి. దానికి తోడు కొత్త ప్రాజెక్టులకు ఆన్‌లైన్‌ ఆమోదం వ్యవస్థ వంటివి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దానికితోడు ఇతర నగరాల కంటే ఇక్కడ జీవన నాణ్యత చాలా మెరుగ్గా ఉంది, విస్తృతంగా, సమద్ధిగా ఆకుపచ్చ చెట్లతో నిండిన ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇతర నగరాలతో పోల్చినప్పుడు కాలుష్యం ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది. దానికితోడు భూముల విలువ పెరుగుతూనే ఉంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో, 2019 మూడవ త్రైమాసికంలో ఆఫీసు కార్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్‌కే చాలామంది ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 40 శాతం పెరుగుదలతో ఆఫీసు నెట్‌ శోషణలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది, వ్యాపార, వాణిజ్య సముదాయాల ఏర్పాటులో మాత్రమే కాకుండా, రెసిడెన్షియల్‌ విభాగంలో కూడా హైదరాబాద్‌ నగరం 2014 నుండి 48 శాతం వద్ధిని కనబరిచింది. ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే అమ్ముడుపోని ఇళ్ళ సంఖ్య కూడా తక్కువ.

అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ త్రైమాసిక నివాస మార్కెట్‌ సమీక్షలో హైదరాబాద్‌లో అమ్ముడుపోని గృహాలు ఇతర మెట్రోలతో పోల్చుకుంటే అతి తక్కువ అని పేర్కొంది. క్యూ 3 2019 నాటికి నగరంలో అమ్ముడుపోని గృహాల జాబితా 23,890 యూనిట్లుగా ఉంది - ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఐదు శాతం తక్కువ.

కొత్త లాంచ్‌ల విషయానికొస్తే, ఉత్తర హైదరాబాద్‌ అత్యధికంగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఈప్రాంతం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటులో 63 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, అమ్మకాలు పశ్చిమ హైదరాబాద్‌లో 65 శాతం ఎక్కువగా జరిగాయి. 'నగరంలో అమ్ముడుపోని ప్రాపర్టీస్‌ తక్కువగా ఉన్నందున రాబోయే త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు పెరుగుతాయని భావిస్తున్నారు'' అని అనరోక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనుజ్‌ పూరి చెప్పారు. వ్యాపార-స్నేహపూర్వక ప్రభుత్వ విధానాలు, కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఎంఎన్‌సిల విస్తరణ, స్టార్టప్‌లతో  భవిష్యత్తులో హైదరాబాద్‌ నగరం పెట్టుబడిదారులకు ప్రదాన గమ్యం అవుతుందని పూరి నొక్కిచెప్పారు. 'హైదరా బాద్‌ రెసిడెన్షియల్‌ మరియు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ కోసం డిమాండ్‌ పెరుగుతుంది'' అని ఆయన చెప్పారు.

ఏదీ ఏమైనా హైదరాబాద్‌ నగరంలో నేడు రియల్‌ ఎస్టేట్‌ రంగం తారాజువ్వలా దూసుకుపోతున్నదని చెప్పడంలో సందేహం లేదు.