హైదరాబాద్‌లో పేపాల్‌ సెంటర్‌

24-07-2019

హైదరాబాద్‌లో పేపాల్‌ సెంటర్‌

అమెరికాకు చెందిన పేమెంట్స్‌ సేవల సంస్థ పేపాల్‌ ఇండియాలో తన మూడో టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పింది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు సైబర్‌ దాడుల బారినపడకుండా నిరోధించడానికి పనిచేయనున్న ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్‌, అమెరికా వంటి దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు తమ కుటుంబాలకు డబ్బు పంపుకోవడానికి పేపాల్‌ సేవలు ఉపయోగించుకోవచ్చని, సురక్షితంగా డబ్బు పంపేందుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు. వ్యాపారవేత్తలు కూడా నగదు లావాదేవీలు నిర్వహించడానికి పేపాల్‌ ఉపయోగపడుతుందన్నారు. పేపాల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తుషార్‌ షా మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలకు, స్టార్టప్లకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని, ఇక్కడ తగినంత మంది ఐటీ నిపుణులు ఉన్నందున టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఈ నగరాన్ని ఎంచుకున్నామని చెప్పారు.

కృతిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి టెక్నాలజీతో ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు సురక్షితంగా జరిగేలా చూస్తున్నామని అన్నారు. టీ-హబ్‌, టీబ్రిడ్జ్‌ వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, టెక్నాలజీ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు. పేపాల్‌ ఇండియా వైఎస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ గురుభట్‌ మాట్లాడుతూ భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో వంద మంది పని చేస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందన్నారు. కస్టమర్ల సమాచారాన్ని నిల్వ చేసే డాటా సెంటర్‌ను ఇండియాలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 200కి పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న పేపాల్‌కు 26 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. మన దేశంలో పేపాల్‌కు ఇది వరకే చెన్నై, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.