ఊహించిన దానికంటే మంచి ఫలితాలు!

15-05-2019

ఊహించిన దానికంటే మంచి ఫలితాలు!

ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. మీరు ఊహిచినదానికంటే మంచి ఫలితాలు వస్తాయి అని మంత్రులతో అన్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు కొందరు మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పేద వర్గాలు టీడీపీ వెంటే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు 1.10 లక్షల మంది ఉన్నారు. వీరికి చివరి మూడు నెలల్లోనే రూ.98 కోట్లు అందాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు స్పందిస్తూ.. మీరు అనుకుంటున్న దానికంటే ఫలితాలు బాగుంటాయి అని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ వైపు వస్తారేమోనని, బీజేపీ వ్యతిరేక పక్షాలతోనే ఉంటారేమోనని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కాగా టీడీపీ మహానాడును ఈసారి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ జయంతి మే 28వ తేదీకాగా, 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి 23న ఎన్నికల ఫలితాలు వస్తుండడంతో మహానాడును గ్రామస్థాయిలో చేయాలని నిర్ణయించారు.