ఏపీలోని ఆ నియోజకవర్గాల్లో ఎన్నిక రద్దు చేయాలి

23-04-2019

ఏపీలోని ఆ నియోజకవర్గాల్లో ఎన్నిక రద్దు చేయాలి

అనంతపురం పార్లమెంట్‌, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికలలో తన కుమారుల కోసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందిగా టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి స్వయంగా చెప్పారని, ఓటుకు రూ.2వేలు పంచామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు అనైతికంగా వెదజల్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. గత 30 ఏళ్లుకుపైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జేసీ దివాకర్‌ రెడ్డి లాంటివారు డబ్బుకోసం రాజకీయాలను దిగజార్చారని విమర్శించారు. జేసీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ సుమోటోగా స్వీకరించి, తక్షణమే అనంతపురం, తాడిపత్రి ఎన్నికను రద్దు చేయాలని ఈసీని రామకృష్ణ కోరారు.