AP CM has expressed the courage that TDP will win again in the state

రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు.