CM KCR Election Campaign in Telangana

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గులాబీదళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంలో అన్నీ తానై మోతమోగిస్తున్నారు. సారొస్తే చాలు.. గెలిచేస్తాం అంటూ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు కేసీఆర్‌ పర్యటనలపై నమ్మకంగా ఉన్నారు. ఏకబిగిన అరవై నాలుగుసభలలో పాల్గొన్న గులాబీదళపతి ఈ ఎన్నికల ప్రచారంలో ఏకవీరగా నిలుస్తున్నారు. ఇప్పటికే 64కు పైగా నియోజకవర్గాలను చుట్టేసిన గులాబీదళపతి, మరో రెండు రోజుల్లో ఇంకో 14సభలలో పాల్గొనబోతున్నారు. ముందు చెప్పినట్లుగానే.. ఏకబిగిన అలుపెరుగని ప్రచారం కొనసాగిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూనే కాంగ్రెస్‌, చంద్రబాబు, బిజెపిలపై నిప్పులు చెరుగుతున్నారు.   మొదట్లో చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారాన్ని మొదలుపెట్టిన కేసీఆర్‌ కరెంట్‌ విజయాలు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా ఫించన్ల వంటి సంక్షేమపథకాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను కూడా వివరిస్తున్నారు. రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తూ.. ప్రజలను ఆకట్టుకునే యత్నాలలో చేస్తున్నారు. ప్రతి సభకూ జనం వెల్లువెత్తుతున్నారని, మావనసముద్రాలను తలపిస్తున్నారంటూ కేసీఆర్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరినీ తీవ్రంగా విమర్శిస్తూ వారు రాష్ట్రానికి ఏమీ చేయలేరని తమ ప్రభుత్వమే ఎంతో మేలు చేసిందని వివరిస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి గులాబీ నేత ప్రయత్నించారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనపై, తన ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతూ మోడీ ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ తన ప్రచారసభలలో ప్రధానిపై కేసీఆర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొత్త రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ముస్లిం, ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగింది.. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు పెరగాలి.. రాష్ట్రం ప్రతిపాదించి కేంద్రానికి పంపితే ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లు ఇవ్వమని అంటున్నడు.. దేశం ఏమన్నా మోడీ అయ్య జాగీరా.. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెసేతర పాలన గల ఫెడరల్‌ ఫ్రంట్‌ రావడం ఖాయమంటూ కేంద్రంపై ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, ఆందోల్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో దుమ్మెత్తిపోశారు. ఎన్నికల ప్రచారసభల్లో  కేసీఆర్‌ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంతో సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ కూటమిపై విమర్శలతో దండెత్తుతూ,  తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 108 సీట్లు సాధిస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయంటూ తమ పార్టీ అభ్యర్థుల్లో గెలుపుపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఈ  సర్వేలకు జంకి కాంగ్రెస్‌ దద్దమ్మలు.. ఆంధ్రా దద్దమ్మను భుజనా వేసుకొని తెలంగాణ కోసం పోరాడి బక్కచిక్కిన నా ఒక్కడి మీద దాడి చేస్తున్నారని అన్నారు. మంచిని గెలిపిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ పాలనలో ఉంది.. తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రూ.1000 పింఛన్‌, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏ ఒక్కటన్నా మీ పాలనకింద ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. ప్రధాని హోదాలోఉన్న మోడీ అసత్యాలు పలకడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ నిరంతరాయంగా సరఫరా చేస్తుంటే పాపం మోదీకి కనిపించడం లేదని, మా కంటి వెలుగు పథకంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యధిక విద్యుత్‌ను వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని సాక్షాత్తు కేంద్ర విద్యుత్‌ సాధికార సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 50 ఏళ్ళపాటు కాంగ్రెస్‌, 15 ఏళ్ళపాటు టీడీపీ పరిపాలన చేసి ఘనాపాఠీలని చెప్పుకుంటున్న వారు ఎందుకు కరెంట్‌ ఇవ్వలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్‌ ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కరెంట్‌ ఇవ్వడం ఆషామాషీ కాదని, రాత్రింబవళ్ళు మంత్రులు, తాను కాపలా కాస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ ప్రవాహ్‌ యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్నారు.

కాగితాల్లోనే కాంగ్రెస్ప్రాజెక్టులు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనికిమాలిన దద్దమ్మని, ఎత్తు పెరిగిండు గానీ బుర్ర లేదని కేసీఆర్‌ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు సాగునీటి వాటాలో అన్యాయం జరుగుతుందని, ఇందుకు ప్రాజెక్టులు ఎక్కడెక్కడ అవసరమో అసెంబ్లీ సాక్షిగా పవర్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే అసెంబ్లీ నుండి పారిపోయారని దుయ్యబట్టారు. తాను ఇంజనీర్లతో కూడి నాలుగు హెలికాప్టర్లలో సర్వే చేసి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కేవలం కాగితాలకే ఈ ప్రాజెక్టులు పరిమితమయ్యాయని, వాళ్ళకు కడుపులో తెలంగాణ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆదాయం పెంచి అనేక పథకాలను అమలు చేస్తున్నామని, శాశ్వతంగా తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెడితే కారు కూతలు కూస్తున్నారని చెప్పారు. అందుకే తాను ముందస్తుకు వెళ్ళి వాళ్ళ నోటికి ప్రజా తీర్పుద్వారా తాళం వేయాలని మీ ముందుకు వచ్చామన్నారు.

దేశంలో రానున్నది ఫెడరల్ఫ్రంట్‌..

రాష్ట్రాలకు స్వయంపాలన లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అణగదొక్కుతున్నాయని, వారి కర్రపెత్తనాన్ని రూపుమాపడానికి బీజేపీ, కాంగ్రెసేతర పాలన రావాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుండి 17 ఎంపీ స్థానాల్లో గెలిచి రిజర్వేషన్లను సాధిస్తామన్నారు. అంతేగాకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌కు రూపకల్పన చేస్తున్నామని స్పష్టం చేశారు.