వెంచర్లపై హెచ్‌ఎండీఏ దృష్టి

31-08-2017

వెంచర్లపై హెచ్‌ఎండీఏ దృష్టి

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వైపు అడుగులు వేసింది. సంస్థకు సంబంధించిన స్థలాలను లేఔట్‌గా మలిచి ఖజానాను పటిష్ఠం చేయాలని నిర్ణయించిన కమిషనర్‌ చిరంజీవులు వెంచర్లపై దృష్టి సారించారు. ఉప్పల్‌ భగాయత్‌లో 413 ఎకరాల్లో భారీ లేఔట్‌ను అభివృద్ధి చేసి సంబంధిత  ప్లాట్లను భూ నిర్వాసితులైన ఉప్పల్‌ రైతులకు కేటాయించగా, దాదాపు  1,00,000 చదరపు అడుగుల స్థలం మిగిలింది. ప్రస్తుతం దీనిని వేలం వేయడం వల్ల  దాదాపు రూ.450 కోట్ల ఆదాయం రావచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడి రియల్‌ డిమాండ్‌ దృష్ట్యా ఈ లేఔట్‌కు అనుకోనే ఉన్న 69 ఎకరాల్లో భారీ వెంచర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ లేఔట్‌ అభివృద్ధికి గాను రూ.33.30 కోట్లతో టెండర్లు పిలిచి అర్హులైన ఏజెన్సీని సైతం ఎంపిక చేశారు.  మల్టీ స్టోరేజ్‌ బిల్డింగ్‌లు, కాంప్లెక్స్‌లే  లక్ష్యంగా వెంచర్‌ పనులు మొదలు పెట్టి దిశగా ఇంజినీర్లు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా మల్టీ స్టోరేజ్‌ బిల్డింగ్‌లు, కాంప్లెక్స్‌లే లక్ష్యంగా వెంచర్‌ పనులు మొదలు పెట్టి ఏడాదిలోగా పూర్తి చేసి వేలం ద్వారా  ఆదాయాన్ని సమకూర్చుకోనున్నారు.

సరూర్‌నగర్‌ లేఔట్‌ స్ఫూర్తిగా.....

1986లో 29 ఎకరాల్లో సరూర్‌నగర్‌లో హెచ్‌ఎండీఏ లేఔట్‌ చేసింది. సరూర్‌నగర్‌ అపార్ట్‌మెంటు కాంప్లెక్స్‌ పేరిట 42  అపార్టుమెంట్లు ఇక్కడ వెలిశాయి. ఎక్కువగా 1,200 చదరపు గజాల స్థలంలో ప్లాట్లు చేసి ఆదాయాన్ని ఆర్జించింది. ఉప్పల్‌ భగాయత్‌ లేఔట్‌ను అనుకొని ఉన్న 69 ఎకరాల్లోనూ 2,400 నుంచి 2,600 చదరపు గజాల స్థలంలో ప్లాట్ల ఏర్పాటు చేయనున్నారు. అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోరేజ్‌ బిల్డింగులే లక్ష్యంగా  ఈ ప్లాట్లను  మౌలిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వాటర్‌ సైప్లె, గ్రీనరీ, ఎలక్ట్రిసిటీ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉప్పల్‌-నాగోల్‌ మెట్రో స్టేషన్‌కు కిలోమీటర్‌ దూరంలోనే ఈవెంచర్‌ ఉండడం, వాణిజ్య సముదాయాలకు డిమాండ్‌ దృష్ట్యా ఈ  ప్లాట్లకు ఆదరణ ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నెలల్లో 2,400, 2600 చదరపు గజాల ప్లాట్లను 60 వరకు చేసి వేలం పాటల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నారు.