Nara Lokesh as Chief Guest for Silicon Andhra University 1st anniversary

అమెరికాలో మొట్టమొదటిసారిగా భారతీయ సంగీతం, నాట్యాలకు సంబంధించిన సర్టిఫికేట్, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీలు అందించే విద్యాసంస్థగా ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మొదటి వార్షికోత్సవం జనవరి 31న క్యాలిఫోర్నియా లోని మిల్పీటస్ నగరంలోని విశ్వవిద్యాలయ కార్యాలయ భవనం ' లో అత్యంత వైభవంగా జరిగింది.  భారతదేశం వెలుపల భారతీయ కళలకోసం ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అని, దీనిని నలంద తక్షశిలల స్థాయికి చేర్చడానికి విశ్వవిద్యాలయ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తోందని, మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మరిన్ని కోర్సులు త్వరలో ప్రారంభంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆనంద్ కూచిభొట్ల తెలిపుతూ, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన భాషాపీఠం ఏర్పాటు త్వరితగతిన జరగడానికి సహకరించాలని మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసారు.

ముఖ్య అతిధి ఐ టీ అమాత్యులు నారా లోకేష్ మాట్లాడుతూ, మన భాషా సంస్కృతులను భావితరాలకు అందించడానికి ఎంతో కృషిచేస్తోన్న సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనండం సంతోషదాయకం గా ఉంది. తెలుగుభాష మీద ఎంతో పరిశోధన  జరగాల్సి ఉన్నది,భాషాపీఠం కోసం తప్పకుండా సహకరిస్తామని హామీ ఇస్త్తు,   త్వరలో ఏర్పాటు చేయబోయే కూచిపూడి 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ' సిలికాన్ ఆంధ్రా సహకారం అందించాల్సిందిగా కోరారు. . ఈ సందర్భంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ సభ్యులు, అకడమిక్ అడ్వైజరీ బోర్డ్ చైర్మెన్ డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు రచించి, విశ్వవిద్యాలయం మొదటి ప్రచురణగా 'రీసెర్చ్ మెథొడాలజీ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ & డ్రామా  అనే పుస్తకం విడుదల చేసారు.  

చీఫ్ ఎకడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మోదటిసంవత్సరం సర్టిఫికేట్, డిప్లొమా విద్యార్ధులు కోర్సులు పూర్తి చేసుకున్నారని, కొత్త సంవత్సరపు తరగతులు ప్రారంభమౌతున్నాయని, ఈ సంవత్సరం నుండి కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యాలతో పాటు భరతనాట్యం కోర్సులో సర్టిఫికేట్, డిప్లొమా     కోర్సులు కూడా ప్రారంభిస్తున్నామని, తెలిపారు. ఇదే సందర్భంగా విశ్వవిద్యాయలం వెబ్‌సైట్ www.universityofsiliconandhra.org ని మంత్రివర్యులు నారాలోకేష్ మరియు సీ ఓ ఓ దీనబాబు గారి చేతులమీదుగా ప్రారంభించారు.   

  

యూనివర్సిటీ బోర్డ్ చైర్మెన్ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు మాట్లాడుతూ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని,  దాతలు ఆర్ధికంగా విరాళాలు అందిస్తే,  ఆర్ధిక పరిపుష్టి కలిగి, సిలికానాంధ్ర చేపట్టే కార్యక్రమాలు మరింత విజయవంతమై, భాష, కళల వికాసానికి ఉపయోగపడతాయని, వారికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని,మరింతమంది దాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వేదమంత్రాలతో ప్రారంభం ఐన సభా కార్యక్రమంలో యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి గారు, నీరజ్ భాటియా, ఆనంద్ కూచిభొట్ల తో పాటు సీ ఈ ఓ రాజు చమర్తి, సీ ఓ ఓ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం ప్రఖ్యాత గాయకులు శ్రీ గరిమెళ్ళ అనిల కుమార్, రవి గుటాల, అనురాధా శ్రీధర్ సహకారంతో ఆలపించిన అన్నమయ్య సంకీర్తనా విభావరి కార్యక్రమంతో సంగీతమయంగా సాగింది. కార్యక్రమానంతరం అచ్చతెలుగు భోజనాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణమంతా పండగ వాతావరణం వెల్లివిరిసింది.   

Click here for Event Gallery