Telangana American Telugu Association Seva Days at Cherapalem

బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో ఆయన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రూ.8 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చెర్లపాలెం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయ దంపతులు హనుమాండ్ల రాజేందర్‌ రెడ్డి, ఝాన్సీరెడ్డి రూ.19 లక్షల విలువ కలిగిన రెండెకరాల భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ఎమ్మెల్యే దయాకర్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. మాతృభూమిపై మమకారంతో రాజేందర్‌రెడ్డి దంపతులు చెర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవటం అభినందనీయమన్నారు. వారికి బాసటగా నిలువాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు, రోడ్ల విస్తరణ పనులకు కావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. చెర్లపాలెం, గొపలగిరి గ్రామాలకు  60 రెండు పడకగదుల ఇళ్లు, వాడవాడలా సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, గ్రంథాలయ భవన నిర్మాణం తదితర అభివృద్ధి పనులు  చేపడుతున్నామన్నారు.

దాత రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన గడ్డపై మమకారంతో గ్రామాన్ని దత్తత తీసుకున్నామన్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ పట్టణాలకు వలస వెళ్లిన వారందరు తిరిగి గ్రామాలకు వచ్చేలా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సాయమందించేందుకు వెనుకాడమన్నారు. ఈ సందర్భంగా రెండుపడకగదుల ఇళ్ల నిర్మాణానికి భూదాన పత్రాన్ని ఉప ముఖ్యమంత్రికి రాజేందర్‌రెడ్డి అందజేశారు. అంతకుముందు గ్రామస్థుల కోలాటం, బతుకమ్మ, వివిధ వేషధారణలతో వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రీతిమీన, సంయుక్త కలెక్టర్‌ దామోదర్‌ రెడ్డి, గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ గాంధీనాయక్‌, ఎంపీపీ కర్నె సోమయ్య, ఏఎంసీ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ దేవేందర్‌ రెడ్డి, వైద్యుడు వెంకట్‌, సర్పంచి ముత్తయ్య, ఆర్డీవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery