great response from california for world telugu conference 2017

తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయంతం చేయాలని మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల కోరారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించారు. విజయ్‌ చవ్వా, పూర్ణ బైరిలు సమన్వయకర్తలుగా ఈ సన్నాహక సదస్సుకు మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు జాతి సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఏ, టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ, సిలికాన్‌ ఆంధ్ర, బీఏటీఏ, వీటీఏ, టీడీఎఫ్‌, టీఏటీఏ, టీఏఎన్‌ఏ, ఏటీఏ, సాన్‌ రామన్‌ ఫ్రెండ్స్‌, తెలంగాణ జాగృతి హెచ్‌ఎస్‌ఎస్‌, డీఎన్‌ఎఫ్‌ సంఘాల ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.