World Telugu Conference Invitation to NRIs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు, పార్లమెంట్‌ సభ్యురాలు కవిత సూచనల మేరకు ఈ మహాసభలను చరిత్రాత్మకంగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా వివిధ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిదారెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు ఎన్నారై కో ఆర్డినేటర్‌గా మహేష్‌ బిగాలను నియమించారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్నారైలు పాల్గొనేలా కోరేందుకు ఎన్నారై కమిటీ కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల వివిధ దేశాల్లో సన్నాహక సదస్సులను ఏర్పాటు చేశారు.  నవంబర్‌ 14న యుకెలోనూ, నవంబర్‌ 15న అట్లాంటా (యుఎస్‌), నవంబర్‌ 17న టొరంటో (కెనడా), నవంబర్‌ 18న శాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్‌, నవంబర్‌ 19న న్యూజెర్సి, నవంబర్‌ 23న వియన్నా (ఆస్ట్రియా)లో ఈ సన్నాహక సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులలో ముఖ్య అతిధిగా మహేష్‌ బిగాల పాల్గొంటున్నారు.

ఆస్ట్రేలియాలో కోర్‌ కమిటీ సభ్యుడు దేశపతి శ్రీనివాస్‌ సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 25న మెల్‌బోర్న్‌లోనూ, 26న సిడ్నీలోనూ ఆయన సన్నాహక సదస్సును ఏర్పాటు చేశారు. మరో సభ్యుడు, కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ దుబాయ్‌, దక్షిణాఫ్రికాలో మహాసభల సన్నాహక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు నవంబర్‌ 17 నుంచి 20 వరకు జరగనున్నాయి. తెలుగు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ఎస్‌వి సత్యనారాయణ  సింగపూర్‌, మలేషియాలో జరిగే సదస్సులలో పాల్గొంటున్నారు. ఈ సదస్సులు నవంబర్‌ 24 నుంచి 26వరకు జరుగుతాయి. న్యూజిలాండ్‌లో నవంబర్‌ 19న, డెన్మార్క్‌లో నవంబర్‌ 26న సన్నాహక సదస్సులు జరుగుతాయని మహేష్‌ బిగాల తెలిపారు.