CM Chandrababu Naidu speech in New York

న్యూయార్కు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

కొత్త రాజధాని నిర్మాణానికి డబ్బులేకున్నా తాము మేధస్సు పెట్టుబడిగా ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు సమీకరించి చరిత్ర సృష్టించామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన శుక్రవారం మూడో రోజుకు చేరింది. చంద్రబాబు ముందుగా ఐయోవా నుంచి న్యూయార్క్ చేరుకుని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా టవర్స్’ లో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ బోర్డ్ మెంబర్, ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మేర్ల్ లించ్’ (Bank of America Merrill Lynch) గ్లోబల్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్టుమెంట్ బ్యాంకింగ్ చైర్మన్ పూర్ణ సగ్గుర్తితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలాంశాలు, ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకుని, ఎదుట నిలిచిన సంక్షోభాన్ని సానుకూలంగా మలచుకున్న వైనాన్ని తెలిపారు. రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాక, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తన కలల ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం భారీ జలవనరుల ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. దశాబ్దాల క్రితం నినాదంగా మోగిన నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో నిజం చేశామని, గోదావరి జలాలను కృష్ణా నదికి తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో మూడేళ్లుగా కరవులేకుండా చేశామని, దేశానికే పట్టిసీమను ఒక నమూనాగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కరవురహిత మాగాణంగా మలచడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జీవ నదులు పారాడే నేల తమ సొంతమని, 975 కి.మీ కు సుదీర్ఘ కోస్తాతీరం ఉందని, తూర్పుతీర ముఖ ద్వారంగా ఉన్న విశాఖ నగరం, 975 కి.మీ పొడవైన సాగరతీరం తదితర భౌగోళికాంశాలు, పుష్కల మానవ వనరులు, ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు ఆంధ్రప్రదేశ్ బలాలు అని, వ్యాపార అనుకూలతలు గల రాష్ట్రాలలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వివరించారు. దేశానికి మధ్యభాగంలో ఉండటం తమకు కలిసివచ్చే అంశమని, తమ రాష్ట్రంలోని ప్రజలు కష్టపడే స్వభావం కలిగిన కృషీవలురని, నిత్యనూతనంగా ఆలోచన చేసే సృజనశీలురు’ అని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం నేటి ప్రపంచ ధోరణులు, సాంకేతికతను అనుసరించి వ్యవసాయ, పరిపాలనా రంగాల్లో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టామని, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

ప్రజలు ఏ ఒక్క సర్టిఫికెట్ కోసం అధికారుల వద్దకు వెళ్లనవసరం లేకుండా ఆన్ లైన్ లోనే పొందే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రెండోతరం ఆర్థిక సంస్కరణలతో గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకుని హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చిన వైనాన్ని ఆయన వివరించారు. గతంలో హైదరాబాద్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేసిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వ్యూహాత్మకంగా పయనం సాగిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్రప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు. 

బ్యాంక్ ఆప్ అమెరికా మెర్లిల్లించ్ లో జరిగిన ఈ సమావేశంలో చటర్జీ గ్రూప్ చైర్మన్ డా. చటర్జీ, మాగ్నా ఇంటర్నేషనల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్వామి కోటగిరి, నలందా 2.0 వ్యవస్థాపకుడు షాలి కుమార్. న్యూ సిల్క్ రూట్ కంపెనీ సీఈఓ పరాగ్ సక్సేనా, ‘నీతిఆయోగ్’ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఎస్.వి.పి ఫైజర్ కు చెందిన జెఫ్ హ్యామిల్టన్, టేస్టీ బైట్ ఈటబుల్స్ సంస్థ చైర్మన్ అశోక్ వాసుదేవన్ టిష్ మ్యాన్ స్పీయర్ సంస్థ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ స్పీస్, ఎస్&పి గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హెడ్ స్వామి కొచ్చర్లకోట, వెనెక్లేశన్ అసోసియేట్స్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ డా. మహావీర్ అత్వాల్ , యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ అఘీ తదితరులు పాల్గొన్నారు. 

Click here for Photo Gallery