TATA Bathukamma and Dasara Celebrations in Bay Area

ఏ దేశమేగినా తమ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోరు తెలుగు వాళ్లు. తెలంగాణ రాష్ట్ర పండుగలు బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రవాస తెలంగాణ సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఆడపడచులు ఉత్సాహంగా నిర్వహించే బతుకమ్మ పండుగను తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఘనంగా నిర్వహించింది. బతుకమ్మ, దసరా సంబరాలు, దసరా జాతర పేరుతో నిర్వహించిన సంబురాలు అంబరాన్ని అంటాయి. అమెరికాలోని బే ఏరియా మిల్పిటాస్ లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మొత్తం 1600 మందికి పైగా తెలంగాణ వారు తమ కుటుంబాలతో ఈ సంబరాలకు హాజరయ్యారు. ఫలితంగా బతుకమ్మ సంబరాలు వన్నె తెచ్చాయి. తెలుగు మాట్లాడే వారంతా ఒక్కటే అని ఈ పండుగకు హాజరై మరోసారి ఐకమత్యం చాటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరోసారి గుర్తు చేశారు. బతుకమ్మ కోసం చాలారకాలైన పూలను తీసుకువచ్చి అలంకరించారు. ఉత్సవం జరిగిన రావణ మరియు లలిత కళాతోరణం, పోచమ్మ గుడి లోపల, బయట పూలతో చాలా అందంగా అలంకరించారు.

ఆడపడుచులు అందంగా ముస్తాబై వంటి నిండా నగలు పెట్టుకుని ఉత్సవానికి హాజరై ఆకట్టుకున్నారు. తెలంగాణ ఆడపడుచులు లలిత పారాయణం, దుర్గదేవి మంత్రాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత బతుకమ్మ పాటలు పాడుతూ పూల బతుకమ్మ చుట్టూర తిరుగుతూ లయబద్దంగా ఆడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా బతుకమ్మ, దసరా సంబరాల్లో పాల్గొని ఆడి పాడిన తీరు అద్భుతం.

టాటా అధ్యక్షురాలు ఝూన్సీరెడ్డి ఈ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించగా... బోర్డ్ ఆప్ డైరెక్టర్ రమేష్ తంగేళ్లపల్లి, ప్రాంతీయ ఉపాధ్యక్షులు అప్పిరెడ్డిలు సహకరించారు. శ్రీనివాస్మానప్రగడ, ఇక్భాల్ గట్టు, సతీష్ బి, శశాంక్ గౌడ్, అమిత్ రెడ్డి, నిషాంత్, ఈశ్వరి పచునూరి, ప్రసాద్ ఉప్పలపు, రవి కుమార్ నేతి, మహేష్ నాని, సోహైల్ అహ్మద్.

Click here for Event Gallery