భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాక్

03-09-2017

భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాక్

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్‌ సర్కారు మరో షాకిచ్చింది. హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాసం)పొందాలనుకునే వారికి అక్టోబర్‌ 1 నుంచి యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేసింది. ఇప్పటికే లక్షల గ్రీన్‌కార్డుల దరఖాస్తులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు రావచ్చు. ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేస్తూ గ్రీన్‌కార్డు నిబంధనల్లో మార్పులపై ఆగస్టు 28న యూఎస్‌సీఐఎస్‌ ప్రకటన విడుదల చేసింది. .  గ్రీన్‌కార్డుల కోసం చేసిన మార్పులపై ఎన్‌పీజెడ్‌ లా గ్రూప్‌ మేనేజింగ్‌ అటార్నీ డేవిడ్‌ హెచ్‌ నచ్‌మన్‌ మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు, పౌరసత్వ ప్రక్రియ కోసం ఇంటర్వ్యూలు తప్పనిసరి. నిజానికి ఉద్యోగ వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారాలంటే ఇంటర్వ్యూలు నిర్వహించడం దశాబ్దకాలంగా అమల్లోఉంది. ఇంతవరకూ ఇంటర్వ్యూల్లో చాలామందికి మినహాయింపు ఇచ్చేవారు. కొత్త విధానంలో అలా మినహాయింపు ఉండదు. గ్రీన్‌కార్డుల కోసం మరింత సమయం నిరీక్షించాల్సి రావచ్చు’ అని చెప్పారు. 

హెచ్‌–1బీ వీసా దరఖాస్తుదారులు రిక్వెస్ట్స్‌ ఫర్‌ ఎవిడెన్స్‌(ఆర్‌ఎఫ్‌ఈ)లు సమర్పించాలని ఇమిగ్రేషన్‌ అటార్నీలకు లేఖలు పెరుగుతున్నాయి. హెచ్‌–1బీ వీసాకు లెవల్‌–1 వేతనాలు అంగీకరించబోమని యూఎస్‌సీఐఎస్‌ తేల్చిచెప్పింది. 2017 ఏప్రిల్‌లో చేసిన హెచ్‌–1బీ వీసా దరఖాస్తులు అక్టోబర్, 1 2017 నుంచి చెల్లుబాటు కానున్న నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌ఈలు సమర్పించాల్సి ఉంది.