రాష్ట్రంలో 5వేల డిజటల్ తరగతులు లక్ష్యం : కొండ్రుకుంట

17-08-2017

రాష్ట్రంలో 5వేల డిజటల్ తరగతులు లక్ష్యం : కొండ్రుకుంట

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5 వేల పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాలక మండలి అధ్యక్షుడు కొండ్రుకుంట చలపతిరావు తెలిపారు. నరసరావుపేటలో తన సోదరుడి ఇంటికి వచ్చిన తానా పాలక మండలి అధ్యక్షుడు కొండ్రకుంట మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,650 డిజిటల్‌ తరగతులకు నిధులు అందజేశామన్నారు. డిజిటల్‌ తరగతుల కోసం 750 డాలర్లు (సుమారు రూ.45వేలు) అంగన్‌ వాడీ భవనాలకు రూ.3లక్షలు అందజేస్తున్నామని, రూ. 7లక్షలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పార. 50 అంగన్‌ వాడీ భవనాలు పూర్తి చేశామని, వెయ్యి పూర్తి చేయాలనేది లక్ష్యమన్నారు. తెలుగు వారి సంస్కృతి, భాష, సంప్రదాయాలు తానా ప్రతిబింబిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో ఇండో అమెరికన్‌ హాస్పిటల్‌ సాయంతో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, శంకర్‌ నేత్రాలయం సాయంతో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

తానా అధ్యక్షుడు చలపతిరావును స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ నిధులు సద్వినియోగం అవుతాయని నమ్మకం కల్పిస్తే తానా ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. పారిశుధ్య పనులకు చలపతిరావు లక్ష ఇచ్చారని, సత్తెనపల్లిలో 13 పాఠశాలల డిజిటలైజేషన్‌కు నిధులు, కేంద్రీయ విద్యాలయానికి రూ.2 లక్షలు విరాళం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అమెరికా స్థిరపడినా ఆంధ్రులు కేవలం డబ్బులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ్రుకుంట లక్ష్మి,  కొండ్రుకుంట శ్రీనివాసరావు, పూనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.