Joe Biden sweeps seven US presidential primaries

రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‍ పార్టీ తరపున తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు జో బైడెన్‍ మరింత చేరువయ్యారు. ఇండియానా, పెన్సిల్వేనియా, రోడ్‍ ఐలాండ్‍, మేరీలాండ్‍, న్యూమెక్సికో, మోంటానా, సౌత్‍ డకోటా రాష్ట్రాలతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్‍ కొలంబియాల్లో తాజాగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మళ్లీ బరిలో దిగనున్నారు. ఆయనపై పోటీకి డెమోక్రటిక్‍ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే బైడెన్‍కు మొత్తం 1,991 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. తాజా విజయాలతో సదరు అర్హత పరిమితిని సాధించేందుకు ఆయన చేరువయ్యారు. దాదాపు మరో 70 మంది ప్రతినిధుల మద్దతు పొందితే అభ్యర్థిత్వం ఖరారవుతుందని  తెలుస్తోంది. వచ్చే వారం వెస్ట్ వర్జీనియా, జార్జియాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలతో బైడెన్‍ పార్టీ తరపున నామినేషన్‍ను అధికారికంగా దక్కించుకుంటారని అంచనా.