యోగాతో రోగనిరోధకశక్తి

06-04-2020

యోగాతో రోగనిరోధకశక్తి

లాక్‍డౌన్‍ కారణంగా ఇళ్లల్లోనే ఉంటున్న వారు యోగా సాధన చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని భారత అమెరికన్‍ కార్డియాలజిస్ట్ ఇంద్రానిల్‍ బసు రే సూచించారు. అమెరికన్‍ హార్ట్ అసోసియేషన్‍ తరపున మార్గదర్శకాలు రాసిన ఆయన, ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హ•ద్రోగుల విషయంలో ధ్యానం, యోగా చాలా మేలు చేసినట్లు గమనించామన్నారు. యోగా అంటే ఒక ఆసనం అని చాలామంది అనుకుంటారని.. కానీ వాస్తవంగా యోగాలో అధికశాతం పక్రియ శ్వాస తీసుకునే విధానంపై నియంత్రణ రూపంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్వాస నియంత్రణపై పట్టు సాధిస్తే.. ఒత్తిడిని సులభంగా జయించవచ్చని తెలిపారు.

టెన్సెసీలోని మెంఫిస్‍ వెటరన్‍ ఆస్పత్రిలో ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రొఫెసర్‍గా పనిచేస్తున్న ఆయన, లాక్‍డౌన్‍ సమయంలో ప్రజల మానసిక స్థితి ఎలా ఉండాలో వివరించారు. ఇంట్లోనే ఉంటున్నామన్న ఆందోళనకు, నిరాశకు గురైతే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వెల్లడించారు. యోగా, ధ్యానంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నదానికి సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆందోళన దూరమై ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కరోనా రోగుల్లో గుండె సమస్యలు కూడా తలెత్తుతున్నప్పటికీ.. వైరస్‍ సరాసరి గుండెపై దాడి చేస్తుందా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదని తెలిపారు.