ఎన్నారైలు స్వదేశం వస్తే మాత్రం...

02-04-2020

ఎన్నారైలు స్వదేశం వస్తే మాత్రం...

అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, తదితర దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు కోవిడ్‍ 19 వైరస్‍తో పెద్దగా ఇబ్బంది పడటం లేదు.  వీరంతా ఇళ్ళ నుంచే పనులు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం కొద్దిమంది తప్ప మిగిలినవారెవరికీ ఈ వ్యాధి జాడలేదు. ఇందుక్కారణం ఆయా దేశాలకెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తూ స్థిరపడ్డ భారతీయులు ఆ దేశపు చట్టాల్ని తూచ తప్పకుండా పాటించడమే. స్థానిక ప్రభుత్వాలిచ్చిన ఆదేశాలకనుగుణంగా వారక్కడ నడుచుకుంటున్నారు. లాక్‍డౌన్‍ నియమనిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ కారణంగానే వారంతా వ్యాధి సోకకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు.  

ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‍, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల్లో 22లక్షల మందికి పైగా భారతీయులు స్థిరపడ్డారు. వీరంతా క్షేమంగానే ఉన్నారు. అయితే విదేశాలకు విద్యాభ్యాసం, పర్యాటకం, వ్యాపార అవసరాలపై తాత్కాలికంగా వెళ్లిన వారంతా అక్కడ్నుంచి భారత్‍ తిరిగొచ్చాక క్రమశిక్షణను పాటించడం లేదు. కరోనా ప్రభలిన అనంతరం వివిధ దేశాల్లో యూనివర్సిటీలను మూసేశారు. హాస్టల్స్ను ఖాళీ చేయించారు. వాటిలోని భారతీయ విద్యార్ధుల్ని బలవంతంగా దేశం నుంచి పంపేశారు. ఎయిర్‍పోర్టుల్లో పడిగాపులుగాసిన ఇలాంటివారందర్నీ భారత ప్రభుత్వం విమానాలు పంపించి మరీ వెనక్కి రప్పించింది. అయితే వచ్చిన అనంతరం వీరు కనీసం వైద్య పరీక్షలక్కూడా ముందుకు రాలేదు. కొన్ని వేల మంది తప్పుడు వివరాలిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పించుకు తిరిగారు. కోవిడ్‍ 19 ప్రభలిన దేశాల్నుంచొచ్చిన వారంతా విధిగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సుండగా ఈ నిబంధనను పాటించలేదు.  వీరి కారణంగానే దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించిందని కొందరు ఆరోపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరిలాగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే మనదేశం కరోనాతో ఇంత ఇబ్బందులను పడేది కాదు.