ఒలింపిక్స్ క్రీడల కోసం మళ్ళీ అందరూ ముందుకు రావాలి

ఒలింపిక్స్ క్రీడల కోసం మళ్ళీ అందరూ ముందుకు రావాలి

25-03-2020

ఒలింపిక్స్ క్రీడల కోసం మళ్ళీ అందరూ ముందుకు రావాలి

టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మళ్లీ అంతే స్థాయిలో నిర్వహించాలంటే దీంతో సంబంధం ఉన్న అందరూ తమ వైపు నుంచి సహకరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఒలింపిక్‍ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‍ బాచ్‍ అన్నారు. అథ్లెట్ల కల అయిన ఒలింపిక్స్ను సాకారం చేయడం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. 2021లో ఒలింపిక్స్ జరపడం మరో పెద్ద సవాల్‍ అని, ఈ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘హియర్‍ వి గో’ పేరుతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘వచ్చే వేసవి సమయంలోనే నిర్వహించాలనే ఏమీ లేదు. ఆ తేదీలతో పాటు ఇతర నెలలకు సంబంధించి కూడా వేర్వేరు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 2021 స్పోర్టస్ క్యాలెండర్‍ను కూడా పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్‍ రూపొందిస్తాం. దీనిపై గురువారం 33 సభ్య దేశాల క్రీడా సమాఖ్యలతో చర్చిస్తాం. ఇక వాయిదా వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే గతంలో మేం ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితి ఇది కాబట్టి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ అని బాచ్‍ వెల్లడించారు.