Bhadradri Balotsav Organised by Talluri Panchaksharaiah Trust at Bhadrachalam

భద్రాద్రి బాలోత్సవం తరహాలో అమెరికాలోని తెలుగు చిన్నారులకు కూడా త్వరలోనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బాలోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు జే తాళ్ళూరి వెల్లడించారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జాతీయస్థాయి భద్రాద్రి బాలోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు ట్రస్టు అధ్యక్షుడు పంచాక్షరయ్య వెల్లడించారు. ఈ వేడుకల్లో జే తాళ్ళూరి మాట్లాడుతూ చిన్నారుల్లో శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు ఈ వేడుకలు దోహద పడతాయన్నారు. ప్రతీ విద్యార్థి ఒక దీపమై సమాజానికి వెలుగులను అందించాలన్నారు. ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తుకు మార్గదర్శనం చేసుకోవాలని కోరారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. ఇది జీవితంలో ముఖ్యమైన విషయమన్నారు. ప్రతిభను చాటుకునేందుకు భద్రాద్రి బాలోత్సవం ఒక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడిందన్నారు. ప్రతీ వ్యక్తికి తండ్రి హీరో అని, తల్లి దైవం కంటే ఎక్కువని, గురువు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. గొట్టిపాటి అనిత మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ వేడుకకు తాను మూడేళ్లుగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ హాజరవుతున్నానని చాలా సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 10,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. బాలోత్సవం రెండవరోజున పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పాటపాడిన చిన్నారి కోయిల గొంతుకలు ,నర్తించిన నాట్యమయురాలు, అభినయానికి అద్దుకున్న రంగుల ముఖాలు, చిత్రకళా సజనను చాటిన చిట్టిచేతులు అక్కడ సందడి చేసాయి. ఏకపాత్రల్లో వీరవిహారం తెలుగు తేనే పలుకులు వివిధ పాత్రల్లోకి ఒదిగిన నాటకాలు, కదిలించే జానపదం పరిమళింప చేసిన నాటకీకరం వీక్షకులకు మధురానుభూతినిచ్చాయి. మరోవైపు శాస్త్రీయ నత్యాలు, చిత్రకళ, వాద్య సంగీతం, లఘుచిత్ర ప్రదర్శన, చూసేవారి హదయాలను బాల్యంలోకి తీసుకెళ్ళాయి. వివిధ సాంస్కతిక అంశాలతో భద్రాద్రి బాలోత్సవం రెండవ రోజు అబ్బురపరిచింది.

ముగింపురోజున...

భద్రాద్రి బాలోత్సవం జాతీయ స్థాయి బాలల పండుగ ముగింపు వేడుకకు ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ అంశాలలో గెలుపొందిన బాల, బాలికలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ భద్రాద్రి బాలోత్సవం విజయవంతంగా సాగిందని ప్రశంసించారు. ప్రతీ మనిషిలో నైపుణ్యం దాగి ఉంటుందని, దాన్ని బయటికి తీసుకురావాలన్నారు. అటువంటి ప్రయత్నమే భద్రాద్రి బాలోత్సవం చేసిందని అభినందించారు. మారుమూల ప్రాంతంలో జాతీయ స్థాయి బాలోత్సవం నిర్వహించి ఎంతో మంది పిల్లలను ప్రోత్సహించిన తాళ్లూరి పంచాక్షరయ్య టీంను ఆయన అభినందించారు. తాళ్లూరి పంచాక్షరయ్య కుటుంబసభ్యులు ఎంతో ఎదిగినప్పటికీ తమ ప్రాంతంపై మమకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. బాలోత్సవం నిర్వహణకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు.

బాలోత్సవాలు దేశమంతా నిర్వహించాలి: తాళ్లూరి పంచాక్షరయ్య

భారతదేశమంతా బాలోత్సవం నిర్వహిస్తే పిల్లలకు ఎంతో ఉపకరిస్తుందని ప్రముఖులు తాళ్లూరి పంచాక్షరయ్య అన్నారు. ఈ విషయాన్ని మేధావులు ఆలోచించాలన్నారు. పోటీల్లో బాల, బాలికలు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా పిల్లలు బహుళ ప్రయోజకులవుతారని పేర్కొన్నారు. ప్రతీ మనిషీకి వ్యక్తిత్వం చాలా అవసరమన్నారు. ఇది కోల్పోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. నైతిక విలువలు కలిగిన విద్యార్థులుగా బాల, బాలికలు ఎదగాలని సూచించారు. తద్వారా సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ బాలోత్సవం నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి ప్రాంతంలో బాలోత్సవం జరపడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చి తద్వారా వారి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

విజేతలకు బహుమతులు

భద్రాద్రి బాలోత్సవంలో వివిధ అంశాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బాల, బాలికలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన బాల, బాలికలు బహుమతులు అందుకున్నారు.

Click here for Event Gallery