Minister KTR invited to Australia India Leadership Dialogue in Melbourne

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఆస్ట్రేలియాలో జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో మెల్‌బోర్న్‌లో నిర్వహించే నాలుగో ఆస్ట్రేలియా- ఇండియా లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొనాలని సదస్సులో పాల్గొనాలని సదస్సు నిర్వాహకులు కేటీఆర్‌ను ఆహ్వాన లేఖలో కోరారు. రెండుదేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగంలోని ప్రభావశీల, నిర్ణయాత్మక ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. ఆస్ట్రేలియా- ఇండియా సంబంధాలు, వివిధ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు వ్యాపార వాణిజ్యరంగాల్లో పెట్టుబడి అవకాశాల బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై సదస్సులో చర్చిస్తారు.

ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి అత్యధిక శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా విద్యా సంస్థలను ఎంచుకుంటున్న తరుణంలో విద్య, టెక్నాలజీ రంగంలో ఉన్న ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై చర్చించే అవకాశం ఉన్నది. ఈ మేరకు మెల్‌బోర్స్‌ సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో తెలిపారు.