కాన్సాస్‌ లో ఘనం గా దసరా, బతుకమ్మ సంబరాలు

10-10-2019

కాన్సాస్‌ లో ఘనం గా దసరా, బతుకమ్మ సంబరాలు

కాన్సాస్‌ తెలుగు సంఘం (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో ఇటీవల ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. స్థానిక హిందూ దేవాలయంలో దసరా మరియు బతుకమ్మ పండుగ సందర్బంగా కాన్సాస్‌ తెలుగు సంఘం నిర్వహించిన సంబరాలు అంబరాన్ని అంటాయి. దేవాలయ పూజారి శ్రీ శ్రీనివాసాచార్య నిర్వహించిన గౌరీ పూజ తో కార్యక్రమాలు మొదలు అయ్యాయి. వేడుక జరిగిన ఆలయ ప్రాంగణమంతా చక్కగా తెలుగు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టేలా అలంకరించారు. నగరంలో నివసిస్తున్న తెలుగు వారంతా చక్కని సాంప్రదాయ దస్తులతో, బతుకమ్మ లను తీసుకొని కార్యక్రమ ప్రదేశానికి రావడంలో అమెరికాలో అచ్చమైన తెలుగు పండుగ వాతావరణం కనిపించింది.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వచ్చిన అదితి బావరాజు మరియు శ్రీకాంత్‌ లంక తమ మాటలు మరియు పాటలతో సంబరాలకు ఊపు తెప్పించారు. ఈసారి ఈ ఉత్సవాల్లో బతుకమ్మ తయారు చేయడం నేర్పించే కార్యక్రమం, గోరింటాకు అలంకరణలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. దాదాపు 1500 మంది తెలుగు వారు పాల్గొన్న ఈ సంబరాలు కాన్సాన్‌ సిటీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని బతుకమ్మ పండుగల కన్నా ఘనంగా జరగడం విశేషం. ఎన్నో హుషారైన బతుకమ్మ పాటలతో చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు అందరూ బతుకమ్మల చుట్టూ ఆడుతూ ఉత్సాహంగా నృత్యం చేశారు. చాలా సేపటి వరకు అందరూ ఉత్సాహం గా ఆడిన కోలాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మద్య మధ్యలో =aటవశ్రీర ద్వారా బహుమతులు ఇస్తూ మిగితా వారందరికీ ఉత్సాహాన్ని కలిగించారు. చక్కగా బతుకమ్మలు చేసిన వారికి పట్టు చీరెలు బహుమతులుగా ఇవ్వడం ఈసారి ప్రత్యేకత. తరువాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకవెళ్లి నిమజ్జనం చేశారు.

కార్యక్రమం ప్రారంభంలో చక్కని ఫలహారాలు మరియు చివరన మంచి రుచికరమైన తెలుగు భోజనాలు వచ్చిన వారందరికీ పండుగ అనుభూతిని కలిగించాయి. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికీ, స్పాన్సర్‌కి కాన్సస్‌ తెలుగు సంఘం అద్యక్షుడు శివ తీయగూర ధన్యవాదలు తెలిపారు.

Click here for Event Gallery