గాంధీమార్గంలో నడవడమే మహాత్ముడికి మనమిచ్చే గౌరవం: ఉపేంద్ర చివుకుల

09-10-2019

గాంధీమార్గంలో నడవడమే మహాత్ముడికి మనమిచ్చే గౌరవం: ఉపేంద్ర చివుకుల

ప్రపంచశాంతి కి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో గాంధేయవాదం గురించి ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవం గా ప్రకటించటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను, ఆయన పాటించిన విలువలను జనం లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపేంద్ర చివుకుల పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే న్యూజెర్సీ గవర్నర్ ఫిలిఫ్ మర్ఫీ కూడా న్యూజెర్సీ రాష్ట్రంలో మహాత్మా గాంధీ 150 వ జయంతి (అక్టోబర్ 2) ని పురస్కరించుకుని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవంగా జరుపుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు, ధార్మిక సంస్థ లకు అధికారిక ఉత్తర్వుల ప్రకటన జారీ చేశారు. సాయి దత్త పీఠంలో ఈ ఉత్తర్వులను ఉపేంద్ర చివుకులు అందరికి చూపించారు. గాంధీ జయంతి నాడు ఆ మహాత్ముడిని స్మరించుకోవడంతో పాటు ఆయన తన జీవితాన్నే ఓ సందేశంగా ఎలా మలిచారో అందరూ తెలుసుకోవాలన్నారు. తద్వారా మనం కూడా మనలోని లోపాలను అధిగమించడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంచుకోవచ్చన్నారు. శాంతి, సహనం, అహింస అనే ఆయుధాలతో ఎన్నో అద్భుత విజయాలు సాధించవచ్చనేది గాంధీ ప్రతక్ష్యంగా నిరూపించారని ఉపేంద్ర చివుకుల తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి తో పాటు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.