హైదరాబాద్‌లో మైక్రాన్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

05-10-2019

హైదరాబాద్‌లో మైక్రాన్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అబితాబ్‌ కాంత్‌ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్‌ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్స్‌ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండర్టర్స్‌ తయారీ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

సుమారు 3,50,000 చ.అ.విస్తీర్ణంలో ఈ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్‌ మెహ్‌రోత్రా తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంలో పాటు హైదారాబాద్‌ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియమకాలు హైదరాబాద్‌ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్‌రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్‌, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డేటా విప్లవంతో ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.