వారంలో రెండుసార్లు అగ్రనేతల భేటీ

19-09-2019

వారంలో రెండుసార్లు అగ్రనేతల భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రానున్న వారంలో రెండు సార్లు భేటీ కానున్నారని అమెరికాలో భారత రాయబారి నిర్ధారించారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ఈ శతాబ్ధంలోనే వినూత్న భాగస్వామ్యం దిశగా సాగనున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సదస్సుకు ప్రధాని మోదీ వచ్చే వారం రానున్న క్రమంలో అగ్రనేతలు ఇరువురూ రెండు సార్లు సమావేశం కానున్నారని భారత రాయబారి హర్ష వర్ధన్‌ ష్రింగ్లా పేర్కొన్నారు. మోదీ, ట్రంప్‌ ఈ నెల 22న భేటీ అవుతారని, హ్యూస్టన్‌లో జరిగే భారతీయుల సమ్మేళనానికి మోదీతో కలిసి ట్రంప్‌ పాల్గొంటారని, న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల నేపథ్యంలోనూ వారిద్దరి మధ్య ముఖాముఖి ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా జపాన్‌లో జీ20, ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సుల సందర్భంగా అగ్రనేతలు ఇటీవల రెండుసార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే ఇరు నేతల మధ్య నాలుగు సమావేశాలు సాగినట్టవుతుందని ష్రింగ్లా వ్యాఖ్యానించారు.