వైట్‌హౌస్‌ ముందు నిరసనలు

16-09-2019

వైట్‌హౌస్‌ ముందు నిరసనలు

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్వీడన్‌కు చెందిన 16 ఏండ్ల గ్రేటా థన్‌బర్గ్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు పాటుపడాలని ఆకాంక్షిస్తూ ఆమె విసృత్త ప్రచారం చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, అమెరికాకు చేరుకున్న గ్రేటా అధ్యక్ష కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేపట్టి ప్రజలను చైతన్యపరిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమెను చూసేందుకు అమెరికన్లు సైతం వైట్‌హౌస్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రతీ శుక్రవారం తన వంతుగా కృషి చేస్తున్నానని గ్రేటా ఈ సందర్భంగా తెలిపారు. తాను నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటం పట్ల గర్వంగా భావిస్తున్నాని అన్నారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాలని మొక్కలను పెంచాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై ఐరాస నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందన్నారు. ఈ సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు గ్రేటా తెలిపారు.