ఇండియన్ బాలే థియేటర్ 37 వ వార్షికోత్సవ వేడుకలు

16-05-2019

ఇండియన్ బాలే థియేటర్ 37 వ వార్షికోత్సవ వేడుకలు

నార్త్ అమెరికా లోని  మెంఫిస్ నగరంలో కొల్లర్విల్ లో గల చర్చి అఫ్ ది హోలీ అపోస్టల్స్ లో మే 11 సాయంత్రము  చల్లని ఆహ్లాదకరమైన  వాతావరణంలో ఇండియన్ బాలే థియేటర్ మరియు స్పిరిట్యుయల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ బాలే థియేటర్ 37వ వార్షికోత్సవం పురస్కరించుకొని అద్భుతమయిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశానికి గర్వకారణమైన కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటు చేసారు.

నృత్య ప్రదర్శనలో మెంఫిస్ నగర నివాసులైన ప్రవాసభారతీయుల కుటుంబాలకు చెందిన నలుగురు చిన్నారి బాలికలు సహస్ర ససిపల్లి, శాన్వి కుంటమల్ల, అమృత గరుడాద్రి, సాత్విక సెంథిల్ కుమార్ లు  అద్వితీయంగా ప్రదర్శించారు. ఇందులో కూచిపూడి నృత్యానికి పట్టుగొమ్మలైన 'పూర్వరంగం' నాట్యాన్ని సహస్ర, శాన్విలు, 'రామాయణ శబ్దం' నాట్యాన్ని అమృత, సాత్విక, సహస్ర, శాన్విలు, 'జతిస్వరం' నాట్యాన్ని అమృత, సాత్వికలు, 'వేయి నామాలవాడే' నాట్యాన్ని అమృత, సాత్విక, సహస్ర, శాన్విలు కనులపండుగగా ప్రేక్షకుల కరతాళధ్వనుల నడుమ నర్తించారు. ఈ నృత్యప్రదర్శనకు రూపకల్పన, దర్శకత్వం డాక్టర్ రమణ వాసిలి, చంద్ర ప్రభ వాసిలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'Best  Student  Award 2018 ' ను యోగితా మానస దినకుర్తి కి బహుకరించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు యశస్వి, మరియా గార్సియా, యస్వంత్, శ్యాం సుందర్, యోగితా మానస, చంద్ర ప్రభలు ఇండియన్ బాలే థియేటర్ యొక్క 37 సంవత్సరాల చరిత్రను, ఆంధ్రుల కూచిపూడి నృత్యాన్ని ప్రవాస భారతీయులకు అందచెయ్యాలనే డాక్టర్ రమణ వాసిలి, చంద్ర ప్రభ ల తపనను కొనియాడారు.

డాక్టర్ రమణ వాసిలి మాట్లాడుతూ ఇండియన్ బాలే థియేటర్ తిరుపతి పట్టణంలో ప్రధమంగా స్థాపించిన విషయం, అక్కడ విర్వహించిన బహు కార్యక్రమాలు చక్కగా వివరించారు. వారికీ కూచిపూడి నృత్యం మీద ఉన్న మక్కువ, దానిని కొంతమంది ద్వారానైనా జాతికి పంచాలి అనే తపన ఇన్ని సంవత్సరాలు తన శ్రమకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభల ముప్పై సంవత్సరాల వివాహ మహోత్సవం కన్నుల పండువుగా సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, ప్రేక్షకులకు బహుమతులతో పాటు సాంప్రదాయక భారతీయ విందును కూడా ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రేక్షకులకు ఒక తీపి గుర్తుగా మిగిల్చారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ మెంఫిస్ మరియు టెన్నెసీ ఆర్ట్స్ కమిషన్ వారి ఆర్థిక సహాయం అందించారు.

Click here for Event Gallery