అంగరంగ వైభవంగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలు...

14-05-2019

అంగరంగ వైభవంగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలు...

అంగరంగ వైభవంగా అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు నాట్స్‌ సిద్ధమైంది. డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతోమంది అతిధులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. తెలుగు ఆట...తెలుగు పాట సంబరాల్లో హోరెత్తనున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా కార్యక్రమాలను సంబరాల కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చిన అతిధుల కోసం కమ్మని వంటలను కూడా ఏర్పాటు చేశారు. ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం బిజినెస్‌ సెమినార్‌లు, కవులకోసం సాహిత్య వేదికలను సిద్ధం చేశారు. సంబరాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు అహోరాత్రులు కృషి చేశారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, కవులు, ఇతర కళాకారులు, వ్యాపార ప్రముఖులు ఈ సంబరాలకు వస్తున్నారు. ఈ సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీలు, మహిళల వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, చిత్రలేఖన పోటీలు విజయవంతమయ్యాయి.

మనమంతా తెలుగు - మనసంతా వెలుగు అనే థీమ్‌తో ఈసారి సంబరాలను నిర్వహిస్తున్నారు. సంబరాల కమిటీ కన్వీనర్‌ కిషోర్‌ కంచెర్ల ఆధ్వర్యంలో నాట్స్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ మంచికలపూడి, నాట్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ పర్యవేక్షణలో ఈ సంబరాలు వైభవంగా జరగనున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, మనో, ఆర్పీ పట్నాయక్‌ వంటి సంగీత ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్‌లో సంగీత విభావరి చేయనున్నారు. కీరవాణి సంగీత విభావరిలో దామినిభాట్ల, మనీషా ఎర్రబత్తిని, మౌనిమ, దీపు, హేమచంద్ర, కాలభైరవ, నోయల్‌ సీన్‌, పృథ్వీచంద్ర, సోని కొమండూరి, శ్రీనిధి పాటలు పాడుతున్నారు. ఆర్‌పి పి. పట్నాయక్‌ సంగీత విభావరిలో సత్యయామిని, ప్రసాద్‌, శ్రీకాంత్‌, బేబీ పాటలు పాడనున్నారు. మనో సంగీత విభావరిలో ప్రవీణ్‌, అంజనా సౌమ్య, రతీష్‌ పాటలు పాడనున్నారు.

నటుడు, నిర్మాత, రచయిత తనికెళ్ళ భరణి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటులు సాయికుమార్‌, రవిప్రకాష్‌, జితేంద్ర, ఆది, సాయిధరమ్‌తేజ్‌, హీరోయిన్‌ తమన్నా భాటియా,  సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్‌, వైవిఎస్‌ చౌదరి, నటి గీత, దర్శకుడు సురేంద్ర రెడ్డి, కొరటాల శివ, బివిఎస్‌ రవి, నిర్మాత కొర్రపాటి తదితరులు వస్తున్నారు.

సాహిత్య రంగానికి సంబంధించి సిరాశ్రీ, భాస్కరభట్ల, రామలింగయ్యశాస్త్రి, చంద్రబోస్‌ తదితరులు వస్తున్నారు. ఆధ్యాత్మికరంగం నుంచి స్వామి చిదాత్మానంద, శ్రీ మాతశివ చైతన్యానంద, బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ, చింతలపాటి సత్యదేవ్‌ తదితరులు వస్తున్నారు.