పిట్స్ బర్గ్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

19-04-2019

పిట్స్ బర్గ్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

పిట్స్‌బర్గ్‌లో శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జెట్‌ పిట్స్‌బర్గ్‌ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో ఫ్రాంక్లిన్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ఈ సీతారామ కల్యాణ వేడుకలను కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సామూహికంగా రామాయణ పఠనం చేశారు. మరికొందరు రామకోటి రాశారు. రామాయణంలోని పలు ఘట్టాలను తెలిపే వేషధారణలతో చిన్నారులు విశేషంగా ఆకట్టుకున్నారు. దశరథ, రామ, లక్ష్మణ, భరత, శతృజ్ఞ, హనుమాన్‌, విశ్వామిత్ర తదితర పాత్రల్లో చిన్నారులు అలరించారు. అలాగే, మరికొందరు చిన్నారులు రామాయణ ఇతివత్తంలోని విశేష ఘట్టాలను ఆవిష్కరించేలా వాల్‌పోస్టర్‌ రూపంలో వేసిన చిత్రలేఖనం ప్రవాసాంధ్రులను ఆకట్టుకుంది. పానకం, వడపప్పు పంపిణీతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. పెన్సిల్వేనియాలోని గ్రేటర్‌ పిట్స్‌బర్గ్‌ ప్రాంతంలో సుమారు 350 మంది భక్తులు శ్రీరామ నవమి వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లు, భక్తులకు సేవలందించిన వలంటీర్లందరికీ జెట్‌ ఛాప్టర్‌ సమన్వయకర్త శ్రీమాన్‌ శ్రీనివాస రాఘవ బెల్లంకొండ ధన్యవాదాలు తెలిపారు.