AP Govt MoU with Iowa State University

ముందుకొచ్చిన ఐయోవా స్టేట్ యూనివర్సిటీ

రాష్ట్రంలో రైతన్నలు నాణ్యమైన విత్తనాలు అందుకునే రోజులు త్వరలో వస్తున్నాయి. ఇన్నాళ్లు దేశానికి అన్నపూర్ణగా వున్న రాష్ట్రం ఇప్పుడు విత్తన భాండారంగా అవతరించనుంది. విత్తనాభివృద్ధిలోనూ, పరిశోధనరంగంలోనూ ప్రపంచంలోనే ప్రఖ్యాంతిగాంచిన అమెరికాలోని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మెగా సీడ్ పార్కు ప్రాజెక్టు తొలిదశకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ డీన్ మిసెస్ ప్రొఫెసర్ వెండీ వింటర్ స్టీన్ అంకురార్పణ చేశారు. వచ్చే అక్టోబరు నుంచే ఈ ప్రాజెక్టు ఫలితాలు రావాలని, ఫలాసాయం కనిపించాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. 

అమెరికా పర్యటనలో భాగంగా నాలుగోరోజైన ఆదివారం ముఖ్యమంత్రి ఐయోవా స్టేట్ యూనివర్సిటీని సందర్శించారు. ఆంద్రప్రదేశ్, భారతదేశ వ్యవసాయరంగం సుసంపన్నం కావాలన్న ఆకాంక్షతో తాను ఇక్కడికొచ్చినట్టు యూనివర్సిటీలోని సీడ్ సైన్స్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రైతాంగం సరైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచారలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటోందని, వాటిని అధిగమించి లాభాల బాట పట్టాలన్నదే ధ్యేయమన్నారు. 

భూసార వివరాలు, సూక్ష్మ పోషకాలు, మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులను అందించడం ద్వారా తమ రైతాంగం ఆదాయం రెట్టింపు చేయదలిచామని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతు సాధికారతే లక్ష్యమని, ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన, సంతోషకరమైనదిగా అభివర్ణించారు.

అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా తమ సంస్థకు వరుసగా ర్యాంకింగ్ లభిస్తున్నట్టు వర్సిటీ డీన్ ప్రొఫెసర్ వెండీ పేర్కొన్నారు. వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ నిరంతరం సహకరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి బృందానికి సీడ్ సెంటర్ డైరెక్టర్ మంజిత్ మిశ్రా ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు అంకురార్పణ తర్వాత ఐయోవా స్టేట్ యూనివర్శిటీలో సీడ్ సైన్స్ సెంటర్‌ ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. టొమాటోలు, ఆపిల్ పళ్ళ దిగుబడి పెంచేందుకు అనుసరిస్తున్న వివిధ పద్ధతులను వ్యవసాయ క్షేత్ర పరిశోధకులు ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ అధిపతి (ప్రొవోస్ట్) ప్రొఫెసర్ జోనాథన్ వికర్ట్ పాల్గొన్నారు.

 

Click here for Photogallery