చిందులు కాదు, దృశ్య కావ్యాలు! చిన్నారులు కాదు చిచ్చర పిడుగులు!

01-05-2017

చిందులు కాదు, దృశ్య కావ్యాలు! చిన్నారులు కాదు చిచ్చర పిడుగులు!

పట్టుమని పదేళ్లకు ఆటో ఇటో. చిన్నారులే కదా ఏదో చిందులేస్తున్నారు అనుకుంటారేమో! చిందులు కానే కాదు అద్భుతమయిన దృశ్య కావ్యాలు ఆవిష్కరించగలరు.  లాలీ లాలీ, లాలీ లాలి, లాలీ లాలీ, లాలీ లాలీ అంటూ వటపత్ర సాయిని లాలించగలరు, కొలని దోపరికి గొబ్బిళ్ళు అంటూ కొలనిలో జలకాలాడుతున్న గోపికల వలువల్ని దొంగలించిన కృష్ణుడి కొంటెతనాన్ని చూపగలరు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ నవరత్న శోభితుడైన జగద్రక్షకుడిని పద సంకీర్తనల్లో విశేషంగా కీర్తిస్తే ఈ చిన్నారులు పాదవిన్యాసాలతో పరవశింప చేస్తారు. పదివేల శేషుల మీద పవళించిన ఆదివిష్ణువుని అదివో అల్లదివో శ్రీహరి వాసము అంటూ కళ్ళకు కట్టినట్లు చూపుతారు. టేనస్సీ రాష్ట్రం లోని మెంఫిస్ పట్టణంలోని ఇండియన్ బాలే థియేటర్ విద్యార్థులు.

మెంఫిస్ మహా పట్టణంలో సాంప్రదాయ కూచిపూడి నృత్య శిక్షణకి చిరునామా స్పిరిట్యుయల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోని ఇండియన్ బాలే థియేటర్. బాలే థియేటర్ వారు శని మరియు ఆదివారాల్లో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో (ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్) గురు మరియు శుక్ర వారాల్లో కాళీర్వీల్లె పట్టణంలోని హోలీ అపోస్టల్స్ చర్చిలో కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.  గత మూడు సంవత్సరాలుగా మెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో, శివరాత్రి, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి, యజ్ఞాలు మొదలైన అనేక హిందూ సాంప్రదాయ పండుగల్లో చక్కనైన నృత్య ప్రదర్శనలు చేసారు.  అలాగే మెంఫిస్ తెలుగు సమితి వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది, సంక్రాంతి, దసరా సాంస్కృతిక ఉత్సవాల్లోను నృత్య ప్రదర్శనలతో ప్రవాస భారతీయుల్ని అలరిస్తుంటారు.

ప్రతి సంవత్సరం మెంఫిస్ లో అత్యంత అట్టహాసంగా ఇండియా అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఫెస్ట్ లో ఇండియన్ బాలే థియేటర్ చిన్నారులు సాంప్రదాయ నృత్యంతో అలరిస్తారు.  అశ్విక బండారు, నిధి నిహారిక చెన్నం, అస్మిత రెడ్డి బొడ్డు, వైష్ణవి పిల్లి, నైధ్రువ మినోతు పేరంబిల్, సహస్ర తోట, సహస్ర ససిపల్లి, శాంతి బలుపు, రశ్మిత బయ్యన, మేఘన బలభద్రుని, రితిక పాగల, శాన్వి కుంటమల్ల, శైలిక మరియు పర్ణిక పగడాల, ఈషా మరియు శ్రీజ సూరిశెట్టి, యోగిత మానస డింతకుర్తి, సాహితి అన్నే చిన్న చిన్న బృందాలుగా అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవుడు రచించిన పదాలు, కీర్తనలు నృత్య రూపకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇండియా బాలే థియేటర్ బృందం జూన్ 2 న మెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయ ద్వితీయ కుంభాభిషేకంలో దాదాపు 20 మంది చిన్నారులతో అద్భుత కూచిపూడి నృత్య యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు స్పిరిట్యుయల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి పావని బండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, శ్రీ రామ నీ నామ ఏంతో రుచి రా, పలుకే బంగార మాయేరా మొదలైన రామదాసు కీర్తనలు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచన కొలువైతివా రంగసాయి, కులుకక నడువరో, ముద్దుగారే యశోద, అదివో అల్లదివో, కొలని దోపరికి వంటి అన్నమయ్య సంకీర్తనలు, అనేక సాంప్రదాయ కూచిపూడి నృత్యాలు ప్రదర్శించనున్నట్లు శ్రీమతి పావని చెప్పారు. మే 26 నుండి 28 వరకు సెయింట్ లూయిస్ లో జరగనున్న "తానా" ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇండియన్ బాలే థియేటర్ మరియు స్పిరిట్యుయల్ ఫౌండేషన్ సెక్రటరీ శ్రీమతి ఇందిరా ప్రియదర్శని చెన్నం చెప్పారు.