అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలంబియా యూనివర్శిటీలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని పేర్కొన్నారు. రూ.16 వేల కోట్ల ఆర్ధిక లోటుతో నవ్యాంధ్ర ప్రదేశ్‌ ప్రయాణం ప్రారంభమైందని, రాజధాని లేదన్నారు. రోజుకు 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటుతో పాటు వ్యవసాయరంగంలో క్రాప్‌ హాలిడే పాటించిన దుస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం సంక్షోభ కాలంలో ఉన్నప్పుడు ప్రజలు అనుభవానికి, సామర్ధ్ద్యానికి ఓటు వేసి తనను గెలిపించారన్నారు. నాలుగేళ్లలో సంక్షోభాలలో అవకాశాలు వెదుకుతూ, పరిష్కారాలతో ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఒక దార్శనికపత్రం రూపొందించుకున్నామన్నారు. 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌ -1గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఒక దార్శనిక పత్రం రూపొందించుకున్నామన్నారు.

నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఏడు రంగాలను ప్రాధాన్య రంగాలు గా గుర్తించి 7 మిషన్లు ఏర్పాటు చేశామని, అవి ప్రాథమిక రంగం, సాంఘిక సాధికారతా మిషన్‌, మౌలిక సదుపాయాల మిషన్‌, సేవారంగ మిషన్‌, జ్ఞాన, నైపుణ్యాభివృద్ధి మిషన్‌, పట్టణ ప్రాంత అభివృద్ధి మిషన్‌, పరిశ్రమల విభాగ మిషన్‌ అని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివ ద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నిశ్చయించి వాటర్‌ గ్రిడ్‌ పవర్‌ గ్రిడ్‌, గ్యాస్‌ గ్రిడ్‌, రోడ్స్‌ గ్రిడ్‌, ఫైబర్‌ గ్రిడ్‌ అనే 5 గ్రిడ్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఏడాదికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు.

మరోవైపు జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణంపూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించే ధ్యేయంతో పనిచేస్తున్నామని, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుతో అమెరికాలో కూడా ఇవ్వనంత బ్యాండ్‌ విడ్త్‌ సమకూరుస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికీ, కేవలం నెలకు రూ.149 కే 15 ఎం.బి.పి.ఎస్‌ డేటా ఇస్తున్నామని, ఒకే కనెక్షన్‌ తో 250 చానెల్స్‌, ఇంటరె నెట్‌, నెట్‌ ఫోన్‌, టీవీ సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు. రాష్ట్రమంతా 25,000 హెచ్‌ పీ వైర్‌ లైన్‌ వేస్తున్నామని, ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. వ్యవసాయానికి సాగునీటి భద్రత కల్పిస్తున్నామని, అలాగే పరిశ్రమలకూ నీటి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ప్రథమంగా మేం రెండు నదులను అనుసంధానం చేశామని, పట్టిసీమతో గోదావరి, కృష్ణా నదులను కలిపామన్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన నదుల అనుసంధానాన్ని నిజం చేశామన్నారు. 

చాలా కాలం క్రితమే తాను టెక్నాలజీ గురించి మాట్లాడాను. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్‌ సంస్కరణలు వేగవంతమయ్యాయని, అందుకు తాను బాధ్యత తీసుకున్నానన్నారు. వికేంద్రీకరణ ప్రారంభమైందని, అంతకు ముందు పబ్లిక్‌ సెక్టారు రెండు సంస్థలైన బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, వి.ఎస్‌..ఎన్‌.ఎల్‌ ఆధిపత్యంలో ఉండేవన్నారు. వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఇంటర్నేషన్‌ కాల్స్‌ కు, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ లోకల్‌ కాల్స్‌ పై ఆధిపత్యం వహించాయన్నారు. అప్పట్లో లైటెనింగ్‌ కాల్స్‌ ఉండేవని, వాటికి కూడా ఒకోసారి రోజులతరబడి నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. ఇవాళ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాట్లాడుకుంటున్నామని, కనెక్ట్‌ అవుతున్నామన్నారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఫోన్‌ కాల్స్‌ కు డబ్బు వసూలు చేయరని, ఇక డేటా ఇచ్చినందుకు రుసుము వసూలు చేస్తారన్నారు. గత నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం సగటున 7.3 % వృద్ది రేటు సాధిస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 10.52%తో రెండంకెల వృధ్ధి రేటు నమోదు చేస్తోంది. సంతోషంగా గడపడమే అర్ధవంతమైన జీవితం అని, అంతిమంగా వన్‌ గవర్నమెంట్‌-వన్‌ సిటిజన్‌. విజిబుల్‌ గవర్నెన్స్‌, ఇన్విజబుల్‌ గవర్నమెంట్‌ మా ధ్యేయమన్నారు. ప్రజలే ముందు, వారి సాధికారతే మా ధ్యేయమన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌ -1 గా తీర్చిదిద్దడానికి కష్టపడి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసరగంలో పేర్కొన్నారు.