Telugu actor Gollapudi Maruthi Rao dies at 80 in Chennai

సినిమా నటునిగా, నాటకరంగ రచయితగా, కథా రచయితగా, వార్తా జర్నలిస్టుగా ఇలా వివిధ రంగాల్లో ప్రవేశం ఉన్న గొల్లపూడి మారుతీరావు అన్నీవర్గాలవారికి, అందరికీ చిరపరిచితులు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల మరణించిన గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. రచయితగా తనప్రస్థానం మొదలుపెట్టిన గొల్లపూడి 'ఇంట్లో రామయ్య వీధిలో కష్ణయ్య సినిమాతో నటుడిగా మారారు.. విలక్షణ నటన, వ్యంగ్యంతో కూడి డైలాగ్‌ డెలివరీ ఆయనకు నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.. దీంతో దశాబ్దాల పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా అనేక పాత్రలు చేశారాయన..

దాదాపు 250 సినిమాల్లో ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, సహాయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వినూత్నమైన విలనిజాన్ని పరిచయం చేసింది గొల్లపూడి మారుతీరావే. అందుకు స్వాతిముత్యం లాంటి చిత్రాలు అద్దంపడతాయి. ఇండస్ట్రీకి రాకముందే -రచయితగా ఎన్నో నాటకాలు, నవలలు, కథలు రాసిన అనుభవం ఆయనది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో వ్యాఖ్యాతగా ఆయన కెరీర్‌ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ కథా రచయితగా, సంభాషణల రచయితగా ఎన్నో చిత్రాలకు పని చేశారాయన. సినీరంగంలో ఆయన మొదటి రచన 'డాక్టర్‌ చక్రవర్తి'. తొలి సినిమాతోనే ఉత్తమ కథా రచయితగా గొల్లపూడికి నంది పురస్కారం దక్కింది. గొల్లపూడి కలంనుంచి జాలువారిన కొన్ని రచనలు -వర్శిటీ పాఠ్యాంశాలయ్యాయి.

తెలుగు నాటక రంగంపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు ఆంధ్ర వర్శిటీలోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగానికి పాఠ్య పుస్తకమైంది. నాటికలు, నాటకాలు, కథానికలు, సినిమా కథలు, పత్రికా వ్యాసాలు.. ఇలా ఏ రచనలోనైనా తనదైన ప్రత్యేక ముద్ర చూపించారు గొల్లపూడి. వర్తమాన రాజకీయాలు, బతుకు ఘటనలపై తనదైన శైలిలో రాసిన 'జీవనకాలమ్‌' -గొల్లపూడికి ప్రత్యేక గుర్తింపునిచ్చిందనే చెప్పాలి. ఆసక్తికరంగా రచనను సాగిస్తూ -చురుక్కుమనే చతురతను ముగింపులో ప్రస్తావించటం మారుతీరావు ప్రత్యేక శైలి. గొల్లపూడి భార్య శివకామసుందరి. ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకష్ణ, శ్రీనివాస్‌. దర్శకుడైన శ్రీనివాస్‌ ఓ చిత్రాన్ని షూట్‌ చేస్తూ ప్రమాదంలో మరణించటంతో -ఆయన పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహకాలు, అవార్డులు అందించారు గొల్లపూడి. గొల్లపూడి అనేక పదవులను కూడా అధిరోహించారు.

250కిపైగా మూవీలలో నటించిన గొల్లపూడికి తొలిమూవీ ఇంట్లో రామయ్య %--% వీధిలో క ష్ణయ్య.. ఆ తర్వాత సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 తదితర మూవీలలో  నటించి ప్రత్యేకతను చాటుకున్నారు. సినీ రంగంలో  1963 లో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా, 1965 లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989 లో కళ్ళు మూవీకి  ఉత్తమ రచయితగా, 1991 లో మాస్టారి కాపురం సినిమాకిగాను ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డులు పొందారు. కథ రచన నుంచి నాటక రచయితగా గొల్లపూడి తనదైన ముద్ర వేశారు. అలాగే నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అందులోనూ నటించారు. వందేమాతరం, రాగరాగిణి, కళ్లు నాటకాలు రచించడమే కాకుండా తానే దర్శకత్వం వహించి దేశంలోని పలు ప్రాంతాలో ప్రదర్శించారు. 

వందేమాతరం, కళ్లు  ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్‌, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. ఎన్నో అవార్డులు, రివార్డు అందుకున్న ఆయనను 2017 లో కళారత్న అవార్డుతో ఎపి ప్రభుత్వం సత్కరించింది.. కాగా, ఆయనకు ముగ్గురు కుమారులు.. చిన్న కుమారుడు శ్రీనివాస్‌  1992 లో తొలిసారిగా దర్శకత్వం వహించి షూటింగ్‌ చేస్తుండగా విశాఖలో జరిగిన నీటి ప్రమాదంలో మరణించారు.. చిన్న కుమారుడి మరణం గొల్లపూడిని తీవ్రంగా క్రుంగ దీసింది. తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రధానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15 వేలు గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహూకరిస్తున్నారు.

కాగా టి వి తెరపై కూడా గొల్లపూడి తన మార్క్‌తో అందర్ని ఆకట్టుకున్నారు..ఈటీవీ 'ప్రతిధ్వని' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి  పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేశారు. 'మనసున మనసై', 'ప్రజావేదిక', 'సినీ సౌరభాలు' తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 'ఇంటింటి రామాయణం', 'గణపతి', 'ఎవరి గోల వారిదే', 'ప్రేమలు పెళ్ళిళ్ళు', 'భార్యా రూపవతీ', 'శత్రు', 'ఏది నిజం?' తదితర ధారావాహికల్లో నటుడిగా కూడా మెప్పించారు. కాగా,  ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకష్ణల వద్ద గొల్లపూడి ఉంటున్నారు.

ఎన్నో పదవులు...

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరంచారు.జాతీయ చలనచిత్ర అభివద్ధి మండలి స్క్రిప్టు పరిశీలన విభాగంలో పనిచేశారు.. 1958లో జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించిన అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించారు. 1996లో జరిగిన ఇండియన్‌ పనోరమాలో జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు..2000 డిసెంబర్‌ 8న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కతిపై సెమినార్‌కు అధ్యక్షత వహించారు.. 2007 జూన్‌ 2,3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిలభారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. 2007 సెప్టెంబర్‌ 23న కష్ణాజిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాస కుడుగా వ్యవహరించారు.