Priyanka Chopra honoured at Marrakech Film Festival for 20 years in cinema

తన ప్రతిభతో అంతర్జాతీయ నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రాకు మరో గౌరవం దక్కింది. సినీరంగానికి ప్రియాంక చేస్తున్న సేవలకు గుర్తింపుగా మొరాకోలో జరుగుతున్న మర్రాకెచ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పురస్కారం అందజేశారు. దీంతోపాటు ప్రియాంక ఇటీవలే యూనిసెఫ్‌ నుంచి డానీ కైన్‌ హ్యూమనేటిరియన్‌ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆమెను ఈ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ పురస్కారాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అందుకు గర్వంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేసింది ప్రియాంక. దక్షిణాసియా ప్రతిభను ప్రపంచ సినిమాకు పరిచయం చేయడం నా జీవిత లక్ష్యం. భారతీయ నటులు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొనేందుకు నేను సహకారం అందిస్తాను అని చెప్పింది. తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ ఓ పెళ్లి కోసం ఇండియాకు వచ్చే భారతీయ అమెరికన్ల బృందం నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీ చిత్రం చేస్తున్నాను. అందులో అందరూ దక్షిణాసియా నటులే నటిస్తారు. దీంతోపాటు ది వైట్‌ టైగర్‌ చిత్రంలోనూ నటిస్తున్నాను అంది ప్రియాంక.