సోనమ్‌ కపూర్‌కు అరుదైన గౌరవం

22-10-2019

సోనమ్‌ కపూర్‌కు అరుదైన గౌరవం

సినిమా, సంగీతం, సాహిత్యం తదితర రంగాల్లో ప్రముఖులు మొత్తం 400 మందిని ది దుబాయ్‌ స్టార్స్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ త్వరలో సన్మానించనుంది. ఇది ప్రపంచ స్థాయి కలిగిన ప్రతిష్టాత్మకమైన పురస్కారం. అటువంటి గౌరవం పొందే వారి జాబితాలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌, గాయకుడు అతిఫ్‌ అస్తామ్‌ నిలిచారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్స్‌ వాక్‌ ఈ పురస్కారం కోసం మొత్తం వెయ్యి మంది పేర్లను పరిశీలించింది. అందులో సోనమ్‌కు స్థానం లభించడంపై ఈ కథానాయిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ గౌరవం దక్కడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఆ వేడుకకు ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైందని నాకు తెలుసు. ఇప్పటి వరకు ఈ విషయం నా స్నేహితులెవ్వరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పాల్సి ఉంటుంది అని తెలిపింది. ఇదే వేడుకకు బాక్లీస్‌ ఫతి, ఖలిద్‌ అల్‌ అమిరి, మోన జకీ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు.