సంక్రాంతికి దర్బార్‌ సందడి

05-10-2019

సంక్రాంతికి దర్బార్‌ సందడి

సంక్రాంతికి దర్బార్‌ తో సందడి చేయనున్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నయనతార కథానాయిక. నివేదా థామస్‌ ముఖ్య భూమిక పోషిస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ఇటీవలే ముంబయి, జయపుర తదితర ప్రాంతాల్లో కీలక యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. రజనీకాంత్‌ ఇందులో పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఆయనపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీ చిత్రం అంటే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తప్పనిసరిగా విడుదలవుతుంటుంది. రజనీ-మురుగుదాస్‌ కలయికలో రూపొందిన చిత్రం కావడం, సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుండడంతో వ్యాపారం పరంగా, వినోదం పరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.