నరేంద్ర మోదీగా అవకాశం ఎవరికి?

21-09-2019

నరేంద్ర మోదీగా అవకాశం ఎవరికి?

ప్రియాంక చోప్రా టైటిల్‌ రోల్‌లో మేరి కోమ్‌ రూపొందించి మెప్పించిన ఒమంగ్‌ కుమార్‌.. వివేక్‌ ఒబరాయ్‌తో తీసిన పి.ఎమ్‌.నరేంద్రమోదీతో ఆశించిన ఫలితం పొందలేకపోయాడు. దీంతో తన బయోపిక్‌ను రూపొందించే బాధ్యతను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీకి అప్పగించారు నరేంద్ర మోదీ. ఆయన 69వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం టైటిల్‌, మరియు ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. హిందీలో మన్‌ బైరాగీ పేరుతో, తెలుగులో మనో విరాగి పేరుతో రూపొందనున్న ఈ చిత్రం గుజరాతీ, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో నరేంద్రమోదీగా నటించే సువర్ణావకాశం ఎవరిని వరించనుందనే అంశంపై బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీకి అత్యంత

సన్నిహితుడైన అక్షయ్‌ కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఆ తరువాత క్రమంలో మోడి భక్తులు అనుపమ్‌ ఖేర్‌, పరేష్‌ రావెల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వివేక్‌ ఒబరాయ్‌ నటించిన చిత్రం నిరాశపరిచి ఉన్నందున తాజా చిత్రంపై నరేంద్రమోదీ కొంత సమయం వెచ్చించనున్నారని తెలుస్తోంది. అంటే తన పాత్ర కోసం ఎంపికయ్యే నటుడుతో ఆయన కచ్చితంగా తన క్యాలిటీ టైమ్‌ వెచ్చించడం ఖాయం.