రాములమ్మ రీ ఎంట్రీ

22-04-2019

రాములమ్మ రీ ఎంట్రీ

గ్లామర్‌ పాత్రలతోనే కాకుండా, ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ వంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతోనూ ఆకట్టుకున్న విజయశాంతి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుండం తెలిసిందే. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతితో నటింపజేయాలని చాలా సంవత్సరాలుగా చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ సక్సెస్‌ కాలేకపోయారు. కానీ అనిల్‌ రావిపూడి ఈ విషయంలో విజయం సాధించారు. మహేష్‌బాబుతో తను రూపొందించే సినిమాలో నటించేలా విజయశాంతిని ఒప్పించారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఇది రెండో విజయంగా చెప్పవచ్చు. పటాస్‌తో దర్శకుడిగా పరిచయమై, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2 చిత్రాలతో వరుసగా నాలుగు ఘన విజయాలు సాధించిన అనిల్‌ రావిపూడి.. తన అయిదో చిత్రాన్ని మహేష్‌బాబుతో రూపొందించే అవకాశం దక్కించుకోవడాన్ని మొదటి విజయంగా అభివర్ణించవచ్చు.