ఉద్యమ సమయంలో మన రాష్ట్రం ఎలా ఉండాలని కోరుకున్నామో ఇప్పుడు అదే విధంగా తెలంగాణ దూసుకుపోతోందని, అనుకున్నది అనుకున్నట్లుగానే పాలన సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 17.8 శాతం ఆదాయవృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.అయిదు లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ గురించి యావత్‌ ప్రపంచానికి తెలియచేప్పే రాయబారులుగా ప్రవాసులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుంచి హాజరైన ప్రవాస తెలంగాణీయులకు కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో విందునిచ్చారు. ఎంపీలు కేశవరావు, జితేందర్‌ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ప్రవాసుల సమన్వయ కర్త మహేశ్‌ బిగాల, ప్రవాసులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలోని అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, భాషా సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్ర పురోగతికి వారి సహకారాన్ని కోరారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి అభివృద్ధిలో కీలకంగా నిలిచారని, తెలంగాణ ప్రవాసులు సైతం ఇదే ఒరవడితో తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. మన ఆస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. మన గొప్పతనం మరుగున పడింది. మన భాష, సంస్కృతి అన్నీ అవమానానికి గురయ్యాయి. సినిమాల్లో తెలంగాణ వారిని జోకర్లుగా చూపెట్టేవారు. ఢిల్లీలో ఎవరితోనైనా మాట్లాడితే ఆంధ్రావారిగా సంబోధించే వారు. ఏపీకి తెలంగాణ నుంచే 70 శాతం ఆదాయం వచ్చేంది. కానీ 10 నుంచి 15 శాతం కూడా ఇక్కడ ఖర్చు  చేయలేదు. ఆచార్య జయశంకర్‌, ఆర్థికవేత్త హన్మంతరావులు 1956 నుంచి లెక్కలను తీసి బయట పెట్టారు. 1350 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు ఉన్నా కనీసం 200 టీఎంసీలు కూడా వాడుకోలేదు. ఉద్యోగ నియమాకాల్లో చెప్పలేని అన్యాయం జరిగింది.