తెలుగు భాషా వికాసానికి ప్రపంచ తెలుగు మహాసభలు నాంది పలకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ వేదికగా తెలుగును వికసింపజేసే దృఢ సంకల్పానికి ఈ మహాసభల పోతన వేదిక నాందీ ప్రస్తావన కావాలన్నారు.  తెలుగు భాష వికాసానికి, విలసిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుందని ప్రకటించారు. తెలుగు భాషను వికసింపజేయాలన్నా, విస్తరింపజేయాలన్నా, విలసిల్లజేయాలన్నా తెలుగు భాషాభిమానులందరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక భాసా పండితుడు మరొక భాషా పండితుడిని తయారు చేయాలి. ఒక కవి మరొక కవిని, పండితుడు మరో పండితుడిని తయారుచేసే సంకల్పాన్ని పూనాలని విన్నవించారు. సమాజానికి మార్గదర్శకులైన గురువుల చేతుల్లోనే భాషా వికాసం ఉందన్నారు.

హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ క్రీడా మైదానంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా పోతన వేదికపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించారు. దాదాపు 35 నిమిషాలపాటు మాట్లాడిన కేసీఆర్‌ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తనకు భాష అబ్బడానికి కారణమైన గురువుల గురించి ప్రస్తావించారు. సులభంగా, సరళంగా జీవిత సారాన్ని నాలుగు ముక్కల్లో చెప్పిన వేమన, భాస్కర శతకాల్లోని పలు పద్యాలను కేసీఆర్‌ సందర్భానుసారం తన ప్రసంగంలో ఉటంకించారు. తెలంగాణ సాహితీవనాలను వికసింపజేసిన ప్రాచీన, ఆధునిక కవులను కీర్తించారు. తాను జన్మించిన సిద్దిపేట ప్రాంతం ఎంతో మంది సాహితీమూర్తులకు పుట్టినిల్లని కొనియాడారు.