ghmc arrangements for the world telugu conference

ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను మరింత శోభాయమానంగా చేయడానికి జీహెచ్‌ఎంసీ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధాన రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతులు, ప్రధాన కూడళ్ల సుందరీకరణ, కార్యాలయాలు, చారిత్రక కట్టడాలకు విద్యుత్‌ దీపాల అలంకరణ తదితర పనులు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా అన్ని ప్రధాన వేదికలవద్ద పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటిసారి ప్రభుత్వం ఈ సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండడంతో దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు.