ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా  ఇవాంక ట్రంప్‌ అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఆమె కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారని ఈ సందర్భంగా ఇవాంకా గుర్తు చేశారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది సదస్సు జరుగుతున్నదని, ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు శుభాకాంక్షలు అని ఇవాంకా అన్నారు.