ప్రత్యేకమైన తెలుగు యూనికోడ్ ఫాంట్స్

15-11-2017

ప్రత్యేకమైన తెలుగు యూనికోడ్ ఫాంట్స్

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన తెలుగు యూనికోడ్ ఫాంట్స్ రూపొందించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రయత్నిస్త్తున్నది. ఈ ఫాంట్స్‌కు తెలుగు సాహితీ వికాసంలో ఎన్నదగిన బమ్మెర పోతన నుంచి కాళోజీ వరకు పేర్లు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. దీనివల్ల కవులపేర్లు నిత్యం జనం నోళ్లలో నానుతాయని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి నమస్తే తెలంగాణతో అన్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న తెలుగు ఫాంట్స్, డిజిటల్ ఫార్మాట్స్‌లో ఎదురవుతున్న సమస్యలపై కోర్‌కమిటీ చర్చించిందని, వీటిని అధిగమించేందుకు యూనికోడ్‌లో అనేకరకాల అక్షర నమూనాలను (ఫాంట్స్) అందుబాటులో ఉంచాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రచురణ సంస్థలు, ఆన్‌లైన్ మీడియా, సోషల్ మీడియా, సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉం చుకుని ఫాంట్స్ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక వెబ్‌సైట్‌

రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం wtc.telangana.gov.in చిరునామాతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందినీ సిధారెడ్డి తెలిపారు. దీని ద్వారా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ తగిన సమాచారాన్ని పొందవచ్చన్నారు. మహాసభల్లో పాల్గొనే వారు ఈ వెబ్‌సైట్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో వ్యక్తిగతం గానూ పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. మరింత సమాచారం కోసం 040-29703142 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.