మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి?

02-09-2017

మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి?

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నర్సింహులుకు గవర్నర్‌ పదవి ఇచ్చే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారనే సంకేతాలను ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్‌.రమణ, పార్టీ సీనియర్‌ నాయకులు విజయవాడలో ముఖ్యమంత్రిని కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్‌ పదవికి సంబంధించి ప్రస్తావించారు. పార్టీకి, సమాజానికి దశాబ్దాలుగా సముచితమైన సేవలు అందిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు దళిత నేతగా తిరుగులేని నేతగా రాణించారని, ఆయన సేవలను కేంద్రం వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నామని పేర్కొన్న చంద్రబాబు, ఇటీవలి కాలంలో పలుమార్లు మోత్కుపల్లి గవర్నర్‌ పదవి విషయమై తాను కేంద్రంతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. మిత్రపక్షంగా కేంద్రం గవర్నర్‌ పదవిని టిడిపికి కేటాయిస్తుందనని మరోసారి చంద్రబాబు టిడిపి నేతల వద్ద ఉద్ఘాటించారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగిన అనంతరం పది రోజుల వ్యవధిలోనే గవర్నర్‌ పదవుల భర్తీ జరుగుతుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా వెల్లడించారు.