beautiful-sculpture-in-yadadri-temple

దేశంలోని అద్భుతమైన శిలా శిల్ప సౌరభాలతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్మిర్మాణ, విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గర్భాలయ ముఖ ద్వార మండపంపై ప్రహ్లాద చరితం కనువిందు చేయనుంది. స్వామివారు స్వయంభువులుగా వెలసిన కొండగుహ గర్భాలయ ముఖ ద్వారంపై నృసింహావతార ఘట్టాన్ని వివరించే ప్రహ్లాద చరితం పురాణ ఘట్టాల ఫలకాల అమరిక తాజాగా పూర్తయింది. అరడుగుల వెడల్పు, ఏడడుగుల ఎత్తు పంచలోహాలతో కళాత్మకంగా రూపొందించిన 10 ప్యానల్స్ను గర్భాలయ ముఖద్వారా మండపానికి అమర్చారు.  

 హిరణ్యకశివుడు మరణం లేకుండా వరం పొందడానికి చేపట్టిన తపోదీక్ష మొదలుకుని, ఇంద్రుడు లీలావతి అపహరణ యత్నం, ప్రహ్లాదుడి జననం, హిరణ్యకశివుడికి బ్రహ్మదేవుడి సాక్షాత్కారం, ప్రహ్లాదుడికి దైవ పరీక్ష, నృసింహుడి ఆవిర్భావం, హిరణ్యకశివుడి వధ.. శాంతమూర్తిగా లక్ష్మీనృసింహుడి అవతార దర్శనం అనంతరం ప్రహ్లాదుడి పట్టాభిషేకం ఘట్టాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయి. పంచలోహ శిల్పాల  తయారీలో నిపుణుడైన శిల్ప కళాకారుడు రవీంద్రాచారి ఆధ్వర్యంలో ఈ దృశ్య ఫలకాలను రూపొందించారు.