తెలంగాణ ఇప్పుడు మరో ఘనత

22-05-2020

తెలంగాణ ఇప్పుడు మరో ఘనత

ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ రంగంలో తనదైన ముద్రవేసిన తెలంగాణ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏటికేడాది అభివృద్ధి సాధిస్తూ కోట్లాది రూపాయల ఎగుమతులతో పాటు, అనేకమందికి ఉద్యోగాల ద్వారా ఉపాది కల్పిస్తోంది. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే మన రాష్ట్రం రెండింతలకు పైగా అభివృద్ధి సాధించింది. ఈ మేరకు ఐటీ వృద్ధిరేటు, ఇతర గణాంకాలను ఐటీశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు 2019-20 ఏడాదికి రూ.1,28,807 కోట్లకు చేరాయి. కొత్తగా 39,093 మందికి ఐటీ ఉద్యోగాలు లభించడంతో ఉద్యోగుల సంఖ్య 5,82,126గా నమోదైంది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‍, ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍లు ముఖ్యమంత్రి కేసీఆర్‍ను కలిసి, ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో వృద్ధి రేటు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. 2019-20 ఏడాదికి రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. కానీ జాతీయ సగటు 8.09  శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగాయి అని కేసీఆర్‍ అన్నారు.